Sharmila: ‘ఛార్జీలు పెంచలేదు’ అనడం దశాబ్దపు అతిపెద్ద జోక్.. కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్ ట్వీట్..!

ఏపీ రాజకీయాల్లో మళ్లీ విద్యుత్ చార్జీల అంశం మంటలు రేపుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం విద్యుత్ చార్జీలను పెంచేది లేదని, ప్రజలపై ఎలాంటి భారం మోపబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన రాజకీయ వివాదానికి దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా సంచలన కౌంటర్లు ఇస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘‘ఛార్జీలు పెంచలేదు’’ అని ముఖ్యమంత్రి చెప్పడం ప్రజల్ని మభ్యపెట్టడమేనని షర్మిల మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిన మోపిందని ఆరోపించారు. ఇప్పటికే ఈ 17 నెలల పాలనలోనే విద్యుత్ చార్జీల రూపంలో ప్రజల నుంచి రూ.15,485 కోట్లకు పైగా వసూలు చేశారని ఆమె పేర్కొన్నారు. ఇదంతా చూస్తే సీఎం చేసిన వ్యాఖ్యలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్‌లా మారాయని ఘాటుగా వ్యాఖ్యానించారు.

విద్యుత్ బిల్లుల మోతతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడని, చాలా కుటుంబాల ఇళ్ల బడ్జెట్ మొత్తం తలకిందులైపోయిందని షర్మిల విమర్శించారు. ట్రూ అప్ పేరుతో యూనిట్‌కు అదనంగా 40 పైసలు వసూలు చేస్తూ వచ్చే రెండేళ్ల పాటు ప్రజలపై పెను భారాన్ని మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితుల్లో ‘‘భారం వేయలేదు’’ అని చెప్పడం ప్రజల బుద్ధిని అవమానించడమేనని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రూ.15,485 కోట్ల సర్దుబాటు భారాన్ని రద్దు చేయాలని షర్మిల సవాల్ విసిరారు. అంతేకాదు, ట్రూ అప్ పేరుతో ఇప్పటికే వసూలు చేసిన రూ.3 వేల కోట్లను ట్రూ డౌన్ రూపంలో ప్రజలకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమలవుతున్న విద్యుత్ ఛార్జీలను కనీసం 30 శాతం తగ్గించాలని కూడా ఆమె ప్రభుత్వం ముందుంచారు.

వైఎస్ షర్మిల చేసిన ఈ ట్వీట్లు కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా మరో కొత్త సవాల్‌గా మారాయి. ఇప్పటికే పలుమార్లు విద్యుత్ చార్జీలపై ఆందోళనలు చేసిన షర్మిల, ఇప్పుడు నేరుగా సీఎం ప్రకటనకే కౌంటర్ ఇవ్వడంతో ఈ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత రాజకీయ ఉష్ణోగ్రతలు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.