ఏపీని భయపెడుతున్న స్క్రబ్ టైఫస్.. ప్రాణాలు తీస్తున్న చిన్న పురుగు.. రాష్ట్రవ్యాప్తంగా బిగ్ అలర్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఓ ప్రమాదకరమైన జ్వరం మెల్లగా పంజా విసురుతోంది. సాధారణ జ్వరం లా మొదలై, గంటల్లోనే శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ వ్యాధి పేరు ఇప్పుడు హడలెత్తిస్తోంది. అదే స్క్రబ్ టైఫస్‌. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా, విజయనగరం జిల్లాలో జరిగిన ఒక మరణం ప్రజల్లో తీవ్రమైన భయాందోళనను రేకెత్తించింది.

చీపురుపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడం, శరీరంపై నల్లటి మచ్చ లాంటివి కనిపించడం, ఆయాసం పెరగడం వంటి లక్షణాలు బయటపడ్డాయి. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొదట ఇది సాధారణ టైఫాయిడ్‌గా భావించి చికిత్స ప్రారంభించారు. జ్వరం కొంత నియంత్రణలోకి వచ్చినట్టే కనిపించినా, ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయి. చివరికి పరిస్థితి చేయి దాటిపోయి ఆమె ప్రాణాలు కోల్పోయింది. తర్వాత చేసిన లోతైన వైద్య పరీక్షలలో అసలు కారణం స్క్రబ్ టైఫస్ అని తేలడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామ ప్రజలే కాదు, చుట్టుపక్కల మండలాల ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. అసలు ఈ వ్యాధి ఏమిటి, ఎలా వస్తుంది, ఎందుకు ఇంత ప్రమాదకరం అనే సందేహాలతో ప్రజలు ఆరా తీయడం మొదలుపెట్టారు. వైద్యుల వివరాల ప్రకారం.. నేలపై ఉండే సూక్ష్మ కీటకాలు, ముఖ్యంగా నల్లని నల్లి పోలిన చిగ్గర్స్ కాటు ద్వారా ఈ వ్యాధి మనుషులకు సోకుతుందట. పొలాల్లో పని చేసే రైతులు, పొదల్లో తిరిగేవారు, జంతువులకు సమీపంగా ఉండేవారు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శరీరంలోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశించిన తర్వాత మొదట తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి. ఆ తర్వాత కాటు వేసిన చోట నల్లటి మచ్చ, వాంతులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలవుతాయి. కొన్ని సందర్భాల్లో అవయవాలు పని చేయకపోవడం, లివర్, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చికిత్స ఆలస్యం అయితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఈ వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు కాగా, కాకినాడ, విశాఖ, కడప, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల వంటి ప్రాంతాల్లోనూ స్క్రబ్ టైఫస్ పెరుగుతున్నట్లు అధికారుల సమాచారం. పరిస్థితి తీవ్రతను గ్రహించిన వైద్య శాఖ పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించింది. గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు, జ్వరం స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

వైద్యులు ఒక విషయాన్ని గట్టిగా చెబుతున్నారు .. జ్వరం రెండు, మూడు రోజులకు మించి కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంపై ఎక్కడైనా నల్లటి గాయం కనిపిస్తే, దుర్వాసన వస్తే, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించాలి. సరైన సమయంలో చికిత్స అందిస్తే మరణాల శాతం రెండు శాతం లోపే ఉంటుందంటున్నారు. కానీ ఊపిరితిత్తుల వరకు ఇన్ఫెక్షన్ వెళ్లితే పరిస్థితి చేయి దాటే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అయితే దీనికి భయం అవసరం లేదంటున్నారు వైద్యులు.. జాగ్రత్త మాత్రం తప్పనిసరి. తడి ప్రాంతాల్లో, పొలాల్లో, చెత్త ఉన్న చోట్ల తిరిగేటప్పుడు రక్షణ చర్యలు పాటించడం, శరీరంపై ఏ చిన్న మార్పు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోవడం చాలా కీలకమని చెబుతున్నారు. ప్రభుత్వ వైద్యులు సమయానికి చేరితే స్క్రబ్ టైఫస్‌ను కట్టడి చేయవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది.