పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడా.. మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తాడా అని వేచి చూస్తున్న అభిమానులకు ఒకేసారి మూడు సినిమాలు చేస్తూ స్వీట్ షాక్ ఇచ్చాడు పవర్ స్టార్. నిర్మాతలు కూడా ఈయన డేట్స్ కోసం కాచుకుని కూర్చున్నారు. దిల్ రాజు అయితే కేవలం 25 రోజుల్లోనే పింక్ సినిమా రీమేక్ పూర్తి చేయాలని ప్లాన్ చేసాడు కానీ కరోనా వచ్చి అంతా పాడు చేసింది. అయినా వకీల్ సాబ్ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. ఈ మధ్యే షూటింగ్‌లో కూడా అడుగు పెట్టాడు పవన్. ఈయనతో పాటు క్రిష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఏఎం రత్నం లాంటి వాళ్లు కూడా మీకు వీలైనప్పుడు డేట్స్ ఇవ్వండి.. సినిమా పూర్తి చేస్తామంటున్నారు. అందుకే క్రిష్ సినిమా కూడా మొదలుపెట్టాడు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే పవన్ కూడా పారితోషికం విషయంలో కొండెక్కి కూర్చున్నాడు. ఈయన మళ్లీ రీ ఎంట్రీలో రచ్చ చేస్తున్నాడు. హరీష్ శంకర్ సినిమా కూడా త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా లైన్‌లో పెట్టేసాడు పవర్ స్టార్.
ఈ సినిమాల కోసం రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు పవన్. వకీల్ సాబ్ కోసం 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే కోట్ల రూపంలో కాదు.. షేర్ రూపంలో ఇది పవన్ ఖాతాలోకి వెళ్తుందని తెలుస్తుంది. పవన్ రీ ఎంట్రీ సినిమా అంటే కచ్చితంగా బిజినెస్ 130 కోట్లకు పైగానే జరుగుతుంది. అజ్ఞాతవాసితోనే పవన్ అప్పట్లో రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా తొలిరోజే 40 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అలాంటి ఇమేజ్ ఉన్న పవన్‌కు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.
రీ ఎంట్రీ సినిమా కోసం నిజంగా 50 కోట్లు తీసుకుంటే మాత్రం అది కూడా ఓ రికార్డే. ఏదేమైనా పవన్ ఇమేజ్ అలా ఉంది మరి ఏం చేస్తాం. క్రిష్ సినిమాకు కూడా 50 కోట్లకు పైగానే ఇస్తున్నాడు ఏఎం రత్నం. హరీష్ శంకర్ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ నాలుగేళ్ల కిందే 13 కోట్ల అడ్వాన్స్ ఇచ్చిందనే వార్తలున్నాయి. ఈ సినిమాకు మొత్తంగా 40 కోట్లతో పాటు రైట్స్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. వాటితో పాటు మలయాళ రీమేక్ అయ్యప్పుమ్ కోషియున్ సినిమా కూడా ఒప్పుకున్నాడు పవన్. ఈ చిత్రం కోసం కేవలం 35 నుంచి 40 రోజులు మాత్రమే కాల్షీట్స్ ఇచ్చాడు పవన్.
దీనికోసం 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు డాలీ, గోపీచంద్ మలినేనిలో ఎవరో ఒకరు దర్శకుడిగా ఉంటారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది. ఇందులో రానా, రవితేజలలో ఎవరో ఒకరు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటితో పాటు సురేందర్ రెడ్డి సినిమా బ్యాలెన్స్ ఉంది. ఏదేమైనా కూడా ప్రతీ సినిమాకు కనీసం 50 కోట్లు అయితే కచ్చితంగా తీసుకుంటున్నాడు పవర్ స్టార్.