Janasena : టీడీపీతో జనసేన కలవడం ఖాయమైపోయినట్టేనా.?

Janasena :  వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ సాక్షిగా ప్రకటించిన

విషయం విదితమే. అధికార వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తి లేదని చెప్పడమంటే, విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినట్లే భావించాలి.

2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అసలు ప్రజా ప్రభుత్వమంటే ఏంటి.? ప్రజలెన్నుకుంటేనే ఎవరైనా అధికారంలోకి వస్తారు.

ఎవరు అధికారంలోకి వచ్చినా అది సాంకేతికంగా ప్రజా ప్రభుత్వమే. కానీ, అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక చర్యలకు దిగితే.. దాన్ని ప్రజా కంటక ప్రభుత్వమని అంటాం.

సరే, ఎవరు అధికారంలో వున్నా ‘ప్రజా కంటక ప్రభుత్వం’ అనే విమర్శల్ని ఎదుర్కోవడమనేది సర్వసాధారణమే. వైసీపీ మీద కూడా ఆ తరహా విమర్శలే వస్తున్నాయి. వస్తాయి కూడా. రాజధాని అమరావతి, మద్యం విధానం.. ఉద్యోగుల సీపీసీ రద్దు.. ఇలా పలు అంశాలపై అధికార వైసీపీ పూర్తిగా గందరగోళంలో పడిపోయిన మాట వాస్తవం.

సంక్షేమం మోజులో పడి వైసీపీ ప్రభుత్వం, అభివృద్ధిని పక్కన పడేసింది. ఇలాంటి అంశాలపై జనసేన సొంత పోరాటం ఏంటి.? అన్నదానిపై జనసైనికుల్లోనే స్పష్టత లేదు. బీజేపీ ఇస్తామన్న రోడ్ మ్యాప్ ఏంటో పవన్ చెప్పలేకపోయారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చబోమని చెప్పడం ద్వారా టీడీపీతోనూ పొత్తులు వుండొచ్చన్న సంకేతాలు అయితే పంపారు.

అయితే, పవన్ మాటల్లో లోతైన అర్థం వుందనీ, జనసేనతో టీడీపీ కలవాలి తప్ప, టీడీపీతో జనసేన కలవబోదనీ, విపక్షాలు ఏకతాటిపైకి వచ్చినా, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థిగా వుంటారనీ జనసేన నేతలంటున్నారు. అది సాద్యమేనా.? టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు ఒప్పుకుంటారా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.