New Bill Of 3 Capitals : 3 క్యాపిటల్స్ కొత్త బిల్లు.. జగన్ సర్కారుకి సాధ్యమేనా.?

New Bill Of 3 Capitals : అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పరిపాలన వికేంద్రీకరణ వేరు. ఒక రాజధాని అంటూ నిర్మించుకోగలిగితే, ఆ తర్వాత వంద రాజధానులు కడతామన్నా ఎవరూ అభ్యంతరం పెట్టే పరిస్థితి లేదు. అయితే, ఇవేవీ ఆలోచించకుండానే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండానే మూడు రాజధానుల బిల్లుని గతంలో వైఎస్ జగన్ సర్కార్ పెట్టిందనే ఆరోపణలున్నాయి. సరే, అధికార పార్టీ వాదనలు వేరు.. వాస్తవ పరిస్థితులు వేరనుకోండి.. అది వేరే సంగతి.

అంతిమంగా మూడు రాజధానుల చట్టం అటకెక్కింది.. మళ్ళీ కొత్తగా మూడు రాజధానుల బిల్లు తెస్తామంటూ అధికార పార్టీ చెబుతోంది. కానీ, అదెప్పుడు.? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లుని మళ్ళీ కొత్తగా పెడతారా.? ఈ క్రమంలో కొత్తగా జరుగుతున్న కసరత్తులేంటన్న ప్రశ్నకు సమాధానం అధికార పార్టీ నుంచి కనిపించడంలేదు.

‘మేం మూడు రాజధానులకు కట్టుబడి వున్నాం..’ అని పదే పదే అధికార పార్టీ.. అందునా పలువురు మంత్రులు కుండబద్దలుగొట్టేస్తున్నారు. కానీ, ఎలా.? సమయం వృధా అయిపోతోంది. రాష్ట్ర ప్రజల్ని మూడు రాజధానుల విషయమై ఒప్పించాలి. మూడు రాజధానులంటున్నారు గనుక, మూడు ప్రాంతాల్లోని ప్రజల నుంచి అభిప్రాయాల్ని సేకరించాలి.

అన్నటికీ మించి, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్ని మెప్పించగలిగితే, మూడు రాజధానులకు ఇబ్బందే వుండదు. కానీ, అలాంటి ప్రయత్నాలేవీ అధికార పార్టీ నుంచి జరగడంలేదు. ఇంత నిర్లక్ష్యపూరిత వ్యవహారశైలితో, రాష్ట్రానికి ఒకటైనా, మూడైనా రాజధాని లేదా రాజధానుల్ని నిర్మించడం అసాధ్యం.

విపక్షాలు, అధికార పార్టీని అడ్డగోలుగా విమర్శిస్తున్నాయనే వాదనను కాస్సేపు పక్కన పెడదాం. అమరావతి రైతుల అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా మూడు రాజధానులంటూ హంగామా చేసి, ఎన్నాళ్ళని ఈ వ్యవహారాన్ని అధికార వైసీపీ నాన్చగలుగుతుంది.?