Basavatarakam Cancer Hospital: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం

అమరావతి: రోగులకు అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి దేశవ్యాప్తంగా కీర్తిని గడించిందని, ఎన్నో అవార్డులను కైవసం చేసుకుందని ఆసుపత్రి చైర్మన్, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. లాభాపేక్ష లేకుండా దాతల సహకారంతో నడుస్తున్న ఈ ఆసుపత్రి, హైదరాబాద్‌లో ఎన్నో అడ్డంకులను అధిగమించి నిర్మాణం పూర్తి చేసుకుందని ఆయన గుర్తు చేసుకున్నారు. బుధవారం అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.

2019లోనే శంకుస్థాపన, ఆలస్యానికి కారణాలు అమరావతిలో ఈ ఆసుపత్రికి 2019లోనే శంకుస్థాపన జరిగిందని బాలకృష్ణ తెలిపారు. అయితే, ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న కొన్ని అంధకార పరిస్థితులు, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనులు చేపట్టలేకపోయామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేశామని, పండుగ వాతావరణంలో పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. రాత్రి కురిసిన భారీ వర్షాన్ని భగవంతుని ఆశీస్సులుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత నేత కోడెల శివప్రసాద్ సేవలను ఆయన స్మరించుకున్నారు.

తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం తన తల్లి బసవతారకం ఆశయాల మేరకు, క్యాన్సర్ రోగులకు తక్కువ ఖర్చుతో అత్యున్నత వైద్యం అందించడమే లక్ష్యమని బాలకృష్ణ స్పష్టం చేశారు. రేడియేషన్ కోసం అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చామని, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాల ద్వారా ప్రజల వద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయ అందిస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు.

రూ.750 కోట్లతో మొదటి దశ అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి మొదటి దశ నిర్మాణానికి రూ.750 కోట్లు ఖర్చు చేస్తున్నామని, దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, దాతలు ముందుకు వస్తున్నారని బాలకృష్ణ వెల్లడించారు. 2028 నాటికి తొలిదశ పనులు పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. క్యాన్సర్ పరిశోధనలకు కూడా ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్టీఆర్ ఆశయ సాధన ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం తన అదృష్టమని, ఆయన ఆశయాలను కొనసాగించడం తన బాధ్యత అని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఉన్నతి కల్పించారని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అదే బాటలో పయనిస్తున్నారని ప్రశంసించారు. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, వారికి లాభం చేకూరేలా రాజధాని నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

రాజకీయ, సినీ రంగ ప్రస్థానం హిందూపురం ప్రజలు తనను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తనను ఆదరించిన అభిమానులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తన గత నాలుగు చిత్రాలు విజయం సాధించాయని, రాబోయే “అఖండ-2” కూడా భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయమైనా, సినిమా రంగమైనా తనకు ఒక్కటేనని బాలకృష్ణ పునరుద్ఘాటించారు.

జగన్ కు మోసం || Journalist Bharadwaj EXPOSED Pulivendula ZPTC Election Results || Telugu Rajyam