వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజధాని అంశాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, వైసీపీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ రాజధాని అంశం కూడా ఒక ప్రధాన అంశంగా గుర్తించారు. తమ పార్టీ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ప్రజలకు నచ్చలేదని ఆయన అంగీకరించడం గమనార్హం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వైసీపీ తన స్టాండ్ పునరాలోచించాల్సిన అవసరం ఉందని జోగి రమేశ్ అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యల వల్ల వైసీపీలో అంతర్గతంగా రాజధాని వ్యవహారంపై దృష్టి మార్చే అవకాశం ఉందా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆయన “జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం” అన్న మాటలు, ఒకవైపు నేతగా విధేయతను చూపించాయి కానీ, మరోవైపు గతంలో తీసుకున్న నిర్ణయంపై రివర్స్ అయినట్లు కూడ వినిపించాయి. ఆయన చెప్పిన ప్రకారం.. జగన్ మూడు రాజధానుల నిర్ణయం మంచి ఉద్దేశంతో తీసుకున్నప్పటికీ, ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయింది.
జోగి రమేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకత్వంలో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అమరావతిని అభివృద్ధి చేస్తామని జగన్ చేసిన హామీకి బదులుగా, గతంలో వైసీపీ మూడు రాజధానుల విధానాన్ని సమర్థించింది. ఇప్పుడు మాత్రం ప్రజల స్పందనను దృష్టిలో ఉంచుకుని పార్టీ స్థానం మారుతోందా అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక టీడీపీ నేత చంద్రబాబు, అమరావతిని పూర్తి రాజధానిగా ప్రకటించగా.. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అదే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ వ్యాఖ్యలు వైసీపీ రాజధాని ఆలోచనల్లో మార్పుకు సంకేతమా? లేక ఒక్కో నేత వ్యక్తిగత అభిప్రాయమా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇది రానున్న రోజుల్లో మరిన్ని చర్చలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.