Chandrabau: చంద్రబాబుకు మరో తలనొప్పి.. సొంత పార్టీ నేతలే ఇలా అడ్డుకుంటే ఇలా?

అమరావతిని గడిచిన దశాబ్దపు కలల రాజధానిగా మళ్లీ నిలబెట్టాలన్న సంకల్పంతో చంద్రబాబు మరోసారి రంగంలోకి దిగారు. సీఎం పదవి చేపట్టిన తొలి రోజునుంచే రాజధాని పనులపై దృష్టి సారించిన ఆయన, ముఖ్య భవనాల నిర్మాణం, నగర మౌలిక సదుపాయాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. 2027 నాటికి నిర్మాణం పూర్తిచేసి, 2029 ఎన్నికల్లో అమరావతిని ముఖ్య అజెండాగా నిలబెట్టాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నేతలు, శాఖలతో త‌న ప్రణాళికలను పంచుకుంటూ, కార్యాచరణ స్పష్టంగా వివరిస్తున్నారు.

కానీ ముడి సరుకుల విషయంలో ఎదురవుతున్న ఆటంకాలు అధికార పరిపాలనకు సవాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇసుక అందుబాటులో లేకపోవడం నిర్మాణాల్లో ఆటంకంగా మారింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ఇసుక సేకరించాలన్న ప్రణాళిక ఉంది. అయినా కాంట్రాక్టర్లకు కావలసిన లారీల సంఖ్య అందక పోవడం, వారాల తరబడి ఎదురు చూడాల్సి రావడం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది. ఇసుకను బ్లాక్ చేయడం లేదా మరొక ప్రదేశానికి తరలించడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇది తెలుసుకున్న చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. పార్టీకి చెందినవారే ఇసుక బ్లాక్ చేస్తూ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారని తెలిసి ఆయన ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. “ఇసుక కదలదు.. రాజధాని ఎలా కదులుతుంది?” అంటూ ప్రశ్నించిన చంద్రబాబు, సమస్యను సీరియస్‌గా తీసుకుంటానని హెచ్చరించారు. అవసరమైతే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.

ఇటీవలే ప్రారంభించిన అమరావతి పనులు ఇప్పుడే అంతరాయాలు ఎదుర్కొనడం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. సరైన సమన్వయం లేకుండా, లోపాలు ఉన్న సప్లయ్ వ్యవస్థతో ఎలా ముందుకు పోతామన్నదే ఇప్పుడు ప్రభుత్వం ముందు నిలిచిన ప్రశ్న. చంద్రబాబు దృష్టిలో నవరాజధాని భవిష్యత్తు ఉంటే.. దానికి అడ్డుగోలుగా మారుతున్న ముద్దుబిడ్డలే అసలు సమస్య అయ్యారన్న దానిపై చర్చ మొదలైంది.