అసాధ్యమే కానీ.. జరిగితే, మాత్రం పవన్ అతి పెద్ద తప్పిదం చేసినట్లే

Impossible, But It May Become Costly Mistake For Pawan

Impossible, But It May Become Costly Mistake For Pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కాబోతున్నారట.. అన్న ప్రచారం తెలుగు నాట జోరందుకుంది. అయితే, ఈ విషయమై బీజేపీ నేతలెవరూ పెదవి విప్పడంలేదు. జనసేన నేతలు కూడా వ్యూహాత్మక మౌనాన్నే ప్రదర్శిస్తున్నారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణను చేపట్టబోతున్నారు.

కొత్తగా దాదాపు 27 మందికి కేంద్ర మంత్రులుగా ప్రధాని నరేంద్ర మోడీ అవకాశమివ్వబోతున్నారన్నది జరుగుతోన్న ప్రచారం తాలూకు సారాంశం. త్వరలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు (అసెంబ్లీ) జరగనున్న దరిమిలా, వాటికి అనుగుణంగానే, రాజకీయ కోణంలో కొత్త కేంద్ర మంత్రుల ఎంపిక వుంటుందనేది నిర్వివాదాంశం. అదే సమయంలో, తెలుగు రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా ఇద్దరికో ముగ్గురికో కేంద్ర ప్రభుత్వంలో అవకాశం దక్కొచ్చు.

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. ఆయన సహాయ మంత్రి పదవిలో హోంశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రపదేశ్ కోటాలోనే పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి అవుతారన్న గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమైతే ఓ తలనొప్పి.. నిజం కాకపోతే ఇంకో తలనొప్పి ఎదుర్కోవాల్సి వస్తుంది జనసేన అధినేత.

పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఓ కేంద్ర మంత్రి పదవి కూడా దక్కించుకోలేకపోయారు.. 2014 ఎన్నికల్లో మద్దతిచ్చారు.. దానికి బీజేపీ, తగిన గౌరవం ఇవ్వలేకపోయింది.. వంటి ప్రస్తావనలు ఖచ్చితంగా వస్తాయి.

ఒకవేళ కేంద్ర మంత్రి పదవిని పవన్ ఒప్పుకుంటే, ప్రజా క్షేత్రంలో ప్రజల ఓట్లతో గెలవలేక.. అడ్డదారిలో కేంద్ర మంత్రి అయ్యారనే విమర్శలొస్తాయి. మరెలా.? బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే పవన్ చేసిన అతి పెద్ద తప్పు.. కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే ఇంకా పెద్ద తప్పు చేసినట్లే అవుతుందంటోన్న రాజకీయ విశ్లేషకుల వాదనపై జనసేన ఏమంటుందో మరి.