ప్రస్తుతం వేసవికాలం కావడంతో చాలా మంది ఎక్కువగా పానీయాలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అలా బయటికి వెళ్లి వచ్చారు అంటే చాలు చల్లగా ఏదైనా తాగాలని అనుకుంటూ ఉంటారు. వేసవిలో బయటకు వెళ్లేందుకు దాదాపు ఎవరూ ఇష్టపడరు. అలాగని రోజువారీ కార్య కలాపాల నుంచి విరామం తీసుకుని ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చోలేం. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడి స్ట్రోక్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. తల తిరగడం, హృదయ స్పందన రేటు పెరగడం, చర్మం ఎర్రబడటం, వికారం, అధిక చెమట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శారీరక అలసట, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే హీట్ స్ట్రోక్ బారీన పడినట్లు సంకేతం.
డీహైడ్రేషన్ వల్ల హీట్ స్ట్రోక్ సమస్య పెరుగుతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఆపై ఉంటే హీట్ స్ట్రోక్ సమస్య పెరిగే అవకాశం ఎక్కువ. ఈ కింద జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో హీట్ స్ట్రోక్ సమస్య నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఉల్లిపాయ రసం ఇందుకు సహాయపడుతుంది. మూత్ర విసర్జన తర్వాత ఉల్లిపాయ రసాన్ని చెవులు, ఛాతీపై అప్లై చేయాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అలాగే పచ్చి ఉల్లిపాయలను కూడా తినవచ్చు. చింతపండు నీళ్ళు తయారు చేసుకుని సేవించినా ఎండతాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. చింతపండులో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి.
ఇవి అధిక శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది వేసవిలో కడుపు సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఎండ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పచ్చి మామిడి షర్బత్ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేడి వాతావరణంలో రోజుకు మూడు సార్లు ఈ డ్రింక్ తాగడం వల్ల ఎలాంటి హాని తలెత్తదు. పచ్చి మామిడి, జీలకర్ర, సోపు, బీట్‌రూట్ వంటి పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచి, తక్షణ శక్తిని అందిస్తాయి. బయటికి వెళ్లాక అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే కొబ్బరి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది శారీరక బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి పెరుగుతో చేసిన మజ్జిగ లేదా లస్సీని తాగవచ్చు. చెమట ద్వారా కోల్పోయే ఖనిజాలు మజ్జిగ ద్వారా పొందవచ్చు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ కూడా అధికంగా ఉంటాయి.