రఘురామపై వేటు వెయ్యగలిగితే.. వైఎస్ జగన్ గెలిచినట్లే..

Disqualify Raghurama, YCP Complains Lok Sabha Speaker

Disqualify Raghurama, YCP Complains Lok Sabha Speaker

తమ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేటు వేయాలంటూ గతంలోనే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీల బృందం విజ్నప్తి చేసిన విషయం విదితమే. ‘రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీయరుగానీ.. ఎంపీ మీద అనర్హత వేటు వేయించడానికోసం ప్రత్యేక విమానంలో వెళతారా.?’ అంటూ అప్పట్లో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ గుస్సా అయ్యిందనుకోండి. అది వేరే సంగతి.

ఇక, ఇప్పుడు ఇంకోసారి వైసీపీ, రఘురామపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలనీ, అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది వైసీపీ. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు, కొన్నాళ్లు వైసీపీలో బాగానే వున్నారు. ఏమయ్యిందోగానీ, వైసీపీ మీద అసహనంతో ఊగిపోతూ, పార్టీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ మీడియాలో స్పేస్ దక్కించుకున్నారు రఘురామ.

ఈ క్రమంలో హద్దులు మీరి ఆయన చేసిన విమర్శలు, రాజద్రోహం కింద ఆయన అరెస్టయ్యేలా చేశాయి. బెయిల్ దొరకడం, ఆ తర్వాత ప్రభుత్వం మీద మరింతగా బురద చల్లేందుకు రఘురామ ప్రయత్నిస్తుండడం ఇవన్నీ వేరే అంశాలు. పార్టీ ఫిరాయింపులు దేశంలో కొత్తేమీ కాదు. దాదాపు అన్ని పార్టీలూ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నాయి. టీడీపీకి చెందిన ఎంపీలు (రాజ్యసభ) బీజేపీలో చేరితే, వారి మీద అనర్హత వేటు పడలేదు. అలాంటప్పడు రఘురామ మీద అనర్హత వేటు పడుతుందని ఎలా అనుకోగలం.? రాష్ట్ర స్థాయిలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ వైపుకు దూకేశారు. వారిపైనా అనర్హత వేటు పడలేదు.

ఈ పరిస్థితుల్లో రఘురామ మీద అనర్హత వేటు వేయాలన్న వైసీపీ పోరాటమే అర్థం లేనిదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఒకవేళ వేటు పడితే మాత్రం, జగన్ సాధించిన అతి పెద్ద గెలుపుగా దీన్ని పరిగణించాల్సి వస్తుందేమో.