కోవిడ్ 19: విద్యార్థుల తల్లిదండ్రుల్ని భయపెడ్తున్న స్కూళ్ళ రీ-ఓపెనింగ్

ఆగస్ట్ 16 నుంచి స్కూళ్ళను తెరవనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు తెరచుకున్నాయి. అక్కడ కరోనా పాజిటివ్ కేసులూ పెరుగుతున్నాయి. సినిమా థియేటర్లను తెరవగా లేనిది, విద్యా సంస్థల్ని తెరిస్తే తప్పేంటన్న ప్రశ్నలోనూ అర్థం వుంది. కానీ, సినిమా వేరు.. స్కూళ్ళు వేరు. సినిమా అనేది తప్పనిసరి కాదు. వెళ్ళాలనుకున్నవాళ్ళు వెళతారు, కరోనా అంటే భయం వున్నోళ్ళు థియేటర్ల వైపు చూడరు. కానీ, విద్యా సంస్థల్ని తెరిస్తే.. ఖచ్చితంగా విద్యార్థులు హాజరు కావాల్సిందే. దేశంలో 18 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో వుంది. కానీ, 30 ఏళ్ళు పైబడినవాళ్ళకే వ్యాక్సిన్ అందుతోంది.. అదీ కనాకష్టంగా. 18 నుంచి 30 ఏళ్ళ లోపువారికే వ్యాక్సిన్ దొరకడం చాలా కష్టమైన వ్యవహారంగా మారింది.

అలాంటప్పుడు, 18 ఏళ్ళ లోపు విద్యార్థుల పరిస్థితేంటి.? మూడో వేవ్ ప్రధానంగా చిన్న పిల్లలపై ఇంపాక్ట్ చూపుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి. మరెలా స్కూళ్ళను తెరుస్తారు.? టీచర్లకు వ్యాక్సినేషన్ వేస్తే సరిపోతుందా.? విద్యార్థులకు కరోనా సోకితే బాధ్యత ఎవరు తీసుకుంటారు.? ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. ఎన్నాళ్ళని విద్యా సంస్థల్ని మూసేయడం.? ఎన్ని విద్యా సంవత్సరాలిలా నాశనమవుతాయ్.? ఒక్క ఏడాది ఏ కారణంగానైనా ఏ విద్యార్థి అయినా నష్టపోతే, అది ఆ విద్యార్థి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటిది, కరోనా నేపథ్యంలో విద్యార్థులందరి పరిస్థితీ తారుమారైపోయింది. అయినాగానీ, ప్రాణం కంటే ఏదీ గొప్పది కాదన్నది మెజార్టీ తల్లిదండ్రుల వాదన. దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది తప్ప, పూర్తిగా తగ్గిపోలేదు. ఎప్పుడెలా కరోనా విజృంభిస్తుందో ఎవరికీ తెలియదు. సో, ఈ సమయంలో రిస్క్ చేయడమంటే.. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటమాడినట్లే.