కర్నూలు జిల్లా ఆస్పర్తి మండలం చిగిలి గ్రామం బుధవారం సాయంత్రం కన్నీరులో మునిగిపోయింది. చిన్నారుల కిలకిలారావాలతో మారుమోగే పల్లె ఒక్కసారిగా విషాద వాతావరణంలోకి జారుకుంది. ఊరి చివర కొండ మీద ఉన్న నీటికుంటలో ఆరుగురు ఐదో తరగతి విద్యార్థులు మునిగిపోయి మృత్యువాత పడటంతో.. ఒకే సారి ఆరు కుటుంబాల్లో తీరని లోటు తలెత్తింది.
ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు స్కూలు ముగిసిన తరువాత సరదాగా ఈతకు వెళ్లారు. కాని ఈత సరదా వారి ప్రాణాలలను తీసింది. వర్షాల కారణంగా నీటికుంటలోకి భారీగా నీరు చేరి, ఒక్కసారిగా నీటిమట్టం పెరగటంతో చిన్నారులు బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు అదృష్టవశాత్తూ బయటపడి ఊర్లోకి చేరి ఈ దుర్ఘటనను తెలియజేశాడు. గ్రామస్థులు పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకునేలోపే ఆరుగురు చిన్నారులు మృత్యు మడుగులో కలసిపోయారు.
ఒకే ఊరిలో ఆరుగురు విద్యార్థులు ఇలా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో చిగిలి గ్రామం కన్నీటి సముద్రంగా మారింది. శవాలు ఆస్పత్రికి తరలించగా, అక్కడ తల్లిదండ్రులు విలపిస్తూ హృదయ విదారక దృశ్యాలు సృష్టించారు. ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు ఒక్కసారిగా మృతదేహాలుగా మారిపోవడం చూసిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘోర ఘటనతో చిగిలి మాత్రమే కాదు, మొత్తం కర్నూలు జిల్లా విషాదంలో మునిగిపోయింది. అధికారులు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వర్షాకాలం కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటల దగ్గర అప్రమత్తంగా ఉండాలని అధికారులు తరచూ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, అమాయక చిన్నారుల సరదా చివరికి ప్రాణాలను బలితీసుకుంది.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, ఆరుగురు విద్యార్థులు అంతా ఒకే తరగతి చదువుతూ, ప్రతిరోజూ కలిసి ఆడుకునే వారు. వారి మరణం ఊరికి మాత్రమే కాదు, స్కూలుకి కూడా తీరని లోటు. ప్రజాప్రతినిధులు, అధికారులు కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ ఘటన పునరావృతం కాకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వర్షాకాలంలో పిల్లలను ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా నిరోధించాలని పెద్దలు కోరుతున్నారు.
