ఢిల్లీలో ఐదు నెలల చిన్నారి కోవిడ్ కారణంగా మృతి చెందడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తగ్గినట్టే అనిపించిన కరోనా మహమ్మారి మళ్లీ తలెత్తుతుండటంతో ప్రజలు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కొత్త కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం, కొన్ని రాష్ట్రాల్లో మృతి కేసులు నమోదు కావడం భయానికి తావిస్తోంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 564 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఏడుగురు మరణించినట్టు నమోదు అయింది. వీరిలో ఒక చిన్నారి ఉండగా, మిగిలిన వారు వృద్ధులే. అధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలో మరణాలు చోటుచేసుకున్నాయి. అత్యధిక యాక్టివ్ కేసులు కేరళలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం కేరళలో 1,487 యాక్టివ్ కేసులు ఉండగా, ఢిల్లీ 562, పశ్చిమ బెంగాల్ 538, మహారాష్ట్ర 526, గుజరాత్ 508 కేసులతో వెంట ఉన్నాయి. ఒక్క ఢిల్లీలోనే 105 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 44 మంది కోవిడ్ వల్ల మరణించగా, వీరిలో చాలా మంది ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారే కావడం ఊరట కలిగించకపోవచ్చు.
అయితే మెజారిటీ కేసులు తేలికపాటి లక్షణాలతో ఉంటున్నాయని, హోమ్ ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ జాగ్రత్తలు అవసరమే. దగ్గినప్పుడు మాస్కులు వాడటం, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండటం, ఆరోగ్య సమస్యలున్నవారు డాక్టర్లను సంప్రదించడం తప్పనిసరి. ఫేక్ న్యూస్‌కు లోనవకండి, అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే నమ్మకాన్ని ఏర్పరచుకోవాలన్నారు.