కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో ప్రతి ఒక్కరూ సీటీ స్కాన్ గురించి ఆలోచిస్తున్నారనీ, ఇది ప్రమాదకరమైన ఆలోచన అనీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం విదితమే. నిజానికి, సీటీ స్కాన్ అంటే అది ఖరీదైన వ్యవహారం. పైగా, అది మూసివున్న గదిలో చేసే స్కానింగ్. తద్వారా కరోనా వైరస్ లేని వ్యక్తి కూడా కరోనా బారిన పడే అవకాశం వుంటుంది. అన్నటికీ మించి, సీటీ స్కాన్ అంటే, అత్యధిక రేడియేషన్ తప్పదు. సీటీ స్కాన్ రూమ్ దగ్గర ఆ విషయం స్పష్టంగా పేర్కొనబడి వుంటుంది కూడా. అందుకే, సీటీ స్కాన్ అనేది అత్యవసరమైతే తప్ప చేయకూడదని వైద్యులు కూడా చెబుతుంటారు. కానీ, ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్, సీటీ స్కాన్ విషయమై రణ్ దీప్ గులేరియా చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించేస్తోంది.
సీటీ స్కాన్ వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం వుందని గులేరియా అనడం సమాజాన్ని తప్పుదోవ పట్టించడమేనన్నది సదరు ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వాదన. ఇదెక్కడి పైత్యం.? అక్కడ విషయం చెప్పింది ఎయిమ్స్ డైరెక్టర్. ఆయనొక్కరే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా పరిశోధనలు సీటీ స్కాన్ ద్వారా ఎదురయ్యే దుష్పరిణామాల గురించి లోతైన పరిశోధనలు చేసి, అత్యవసరమైతే తప్ప సీటీ స్కాన్ చేయడం మంచిది కాదంటున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు, సీటీ స్కాన్ అనేదాన్ని చాలా పరిమితంగా వాడతాయి. భారతదేశంలోనే, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. చిన్న అనారోగ్య సమస్య వస్తే చాలు, సీటీ స్కాన్ చేయించావా.? అనే ప్రశ్న తెరపైకొస్తున్న రోజులివి. ఇది మన భారదేశానికి మాత్రమే పరిమితమైన పైత్యంగా చూడాలేమో. కేవలం కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ లేబోరేటరీలకు లబ్ది చేకూర్చేలా సీటీ స్కాన్ అనేదానికి మద్దతుగా మాట్లాడటం శోచనీయం. కరోనా వస్తే ఏం చేయాలన్నదానిపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చంది. దాని ప్రకారమే లక్షల మందికి వైద్యం జరుగుతోంది. సీటీ స్కాన్ అనేది చాలా అరుదైన అంశం. తప్పనిసరైతే తప్పదు.. సీటీ స్కాన్ అయినా చేయించాల్సిందే.