ఉత్తరప్రదేశ్ లో దారుణం… గోడ కూలడంతో తొమ్మిది మంది మృతి…!

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరూ ఊహించలేరు. అనుకోని ప్రమాదాల వల్ల కొన్ని నిమిషాలలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా చాలా ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కూడా ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. అధిక వర్షాల వల్ల ఇంటి గోడ కూలి పడటంతో 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే…దిల్‌ఖుషా ప్రాంతంలోని ఆర్మీ ఎన్‌క్లేవ్ గోడను ఆనుకుని ఉన్న గుడిసెల్లో కొందరు కార్మికులు నివసిస్తున్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున గుడిసెలో కార్మికులు నిద్రిస్తుండగా గోడ కూలి గుడిసెలో నిద్రిస్తున్న వారు తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో గోడ శిథిలాల కింద చిక్కుకొని ఉన్న వారిని బయటకు తీశారు.

ఈ ప్రమాదంలో కొంతమంది మరణించగా.. మరికొంతమంది తీవ్రగాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఈ ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మందిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అధికంగా కురుస్తున్న వర్షాల వల్ల గోడ ఎక్కువగా నానటంతో కూలిపోయిందని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. ఈ ప్రమాదం పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ సింగ్ కూడా విచారణ వ్యక్తం చేస్తూ ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయమని అధికారులను ఆదేశించాడు.