సీఎం కుమారుడి తల తెస్తే 10కోట్లు… అర్చకుడి సంచలన ప్రకటన!

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ మాటల అర్ధం, పరమార్ధం ఇది అని ఆయన వివరంగా వివరణ ఇచ్చిన తర్వాత కూడా… అర్ధం అయిన వారు, కాని వారు కూడా ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో ఒక అర్చకుడు శృతిమించాడు! తాను పైకి అర్చకుడి వేషంలో ఉన్నప్పటికీ… తానొక మతతత్వ ఉగ్రవాదిని అని చెప్పుకున్నంత పనిచేశారు!

అవును… ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చిస్తే వారికి 10 కోట్ల రూపాయల బహుమతి ఇస్తానంటూ ఓ అర్చకుడు ప్రకటించాడు. దీంతో ఈ వ్యవహారంతో తీవ్ర కలకలం రేగింది. దేవుడికి – మనుషులకు మధ్య వారధిగా ఉండాల్సిన అర్చకుడు… ఇలా ఉగ్రవాదిలా మాట్లాడారు!

ఉత్తర ప్రదేశ్ లోని తపస్విచావిని ఆలయ ప్రధాన ఆర్చకుడు పరమహంస ఆచార్య ఈ సంచలన ప్రకటన చేశారు. ఉదయనిధి ఫొటోని చేతిలో పట్టుకుని ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి బహుమతిస్తానంటూ ప్రకటించారు. ఎవరూ ఆ పని చేయకపోతే తానే ఉదయనిధి జాడ కనుక్కుని ఆయన తల నరికి వేస్తానంటూ ఊగిపోయారు. ఇది ఈ అర్చకుడి సనాతన ధర్మం తాలూకు రిఫ్లెక్షన్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే… తన తల నరికి తేవాలంటూ ఉత్తరప్రదేశ్ అర్చకుడు చేసిన వ్యాఖ్యల్ని లైట్ తీసుకున్నారు ఉదయనిధి స్టాలిన్. తల దువ్వుకోడానికి తనకు 10 రూపాయల దువ్వెన చాలని, 10కోట్లు అక్కర్లేదని రియాక్ట్ అయ్యారు. బెదిరింపులు తమ కుటుంబానికి కొత్త కాదని, తాము ఈ బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని క్లారిటీ ఇచ్చారు. తమిళ భాష కోసం రైలు ట్రాక్ పై తల పెట్టిన కరుణానిధి మనవడినని స్టాలిన్ గుర్తు చేశారు.

మరోవైపు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను బీజేపీ రాజకీయ అస్త్రంలా మార్చుకుంది. ఇందులో భాగంగా… ఉదయనిధి వ్యాఖ్యలను అడ్డు పెట్టుకుని “ఇండియా” కూటమిపై ఎదురుదాడి మొదలు పెట్టింది. కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలకు అనుకూలమా, వ్యతిరేకమా తేల్చి చెప్పాలని అంటోంది. ఇలా ఉదయనిధి వ్యాఖ్యలకు బీజేపీ రాజకీయ రంగు పులిమింది! మరి ఈ వ్యవహారం ఎక్కడ ముగుస్తుందనేది వేచి చూడాలి!