ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాధ్ పాదాలను తాకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దండం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై భిన్న స్వరాలు వినిపించాయి. అయితే ఈ విషయాలపై తాజాగా స్వయంగా రజనీకాంత్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!
అవును… ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి కాళ్లు మొక్కి దండం పెట్టడంమీద తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు. యోగులు సన్యాసుల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం తనకు అలవాటు అని ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయంలో వారు వయసులో చిన్నవారు అన్నది తాను ఆలోచించనని.. వారి ఆశీర్వాదం తీసుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తానని.. అదే తనకు ముఖ్యమని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా యోగి ఆదిత్యానాధ్ పాదాలను రజనీకాంత్ తాకి దండం పెట్టడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ సాగిన సంగతి తెలిసిందే. రజనీ తప్పు చేశారు అన్నట్లుగా కొంతమంది ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. అవి సామాజిక మాధ్యమాలలోవైరల్ గా మరాయి! అయితే ఈ ట్రోల్స్ పై నెటిజన్లు చాలా మంది భిన్నంగా రియాక్ట్ అయ్యారు.
అందులో భాగంగా.. రజనీ వయసుని కూడా ఎత్తి చూపిస్తూ 72 ఏళ్ళ రజనీకాంత్.. 52 ఏళ్ళ యోగీ ఆదిత్యనాధ్ కి దండం పెట్టడమా అని అన్నారు. అంతే కాదు తమిళుల ఆత్మగౌరవం అంటూ మరి కొందరు ఈ వివాదాన్ని పీక్స్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా పట్టుకుని నెటిజన్లు ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెప్పారు.
ఇదే సమయంలో రజనీకాంత్ ని మెచ్చుకున్న వారూ ఉన్నారు. అంతటి గొప్ప స్థాయిలో ఉన్న నటుడు అయినా.. నిరాడంబరంగా ఉన్నారని, ఆయన సాధారణ జీవితం గడుపుతారు అనడానికి ఇదొక ఉదాహరణ అని.. ఎవరిని ఎలా గౌరవించాలో రజనీకి బాగా తెలుసు అని ఆయనకు అనుకూలంగా కొంతమంది కామెంట్స్ పెట్టారు.
ఈ క్రమంలో తాజాగా తన ఉత్తరాది పర్యటన ముగిసిన అనంతరం రజనీ చెన్నైకి చేరుకున్నారు. ఆయన చెన్నై చేరుకున్న తరువాత ఈ విషయంపై స్పందించారు. తాను యోగులను గౌరవిస్తాని అంతే తప్ప వారి వయసు ఇతరాలు ఏవీ చూడను అంటూ కచ్చితంగా తనదైన స్టైల్లో చెప్పారు. దీంతో… ఈ వివాదానికి శుభం కార్డు పడిందని అంటున్నారు పరిశీలకులు!