సహజీవనంపై వాయించి వదిలిన హైకోర్టు… తెరపైకి ఘాటు వ్యాఖ్యలు!

ప్రస్తుతం లివ్‌ ఇన్‌ రిలేషిన్‌ షిప్‌ (సహజీవనం) భారత్‌ లో బాగా ట్రెండవుతోంది. పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లోకి ఈ కల్చర్‌ విస్తరిస్తోంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ మధ్య కాలంలో కాస్త మండల కేంద్రాలకూ విస్తరించిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ సహజీవనంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే చేసింది.

సాధారణంగా సహజీవనం అనేది భారతదేశ సంస్కృతి ప్రకారం అదో భూతు పదం అనేవారు లేకపోలేదు. దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేసేవారు పుష్కలంగా ఉన్నారు. సహజీవన సంబంధాలతో భారత వివాహ వ్యవస్థ పూర్తిగా కలుషితమవుతోందని చెప్పేవారు లేకపోలేదు.

ఈ నేపథ్యంలో అలహాబాద్‌ హైకోర్టు సహజీవనంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. స‌హ‌జీవ‌న సంబంధాల పేరుతో భారతదేశంలోని వివాహ వ్యవ‌స్థను ఒక క్రమ‌ప‌ద్ధతిలో ధ్వంసం చేస్తున్నార‌ని అల‌హాబాద్ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ స‌హ‌జీవ‌న సంబంధాలు ఏమాత్రం ఆరోగ్యక‌రం కాద‌ని స్పష్టం చేసింది.

అవును… ఒక వ్యక్తికి వివాహం ద్వారా అందే సామాజిక భద్రత, అంగీకారం, స్థిరత్వం.. సహజీవన సంబంధాలు అందించవని అలహాబాద్‌ హైకోర్టు తేల్చిచెప్పింది. ఒక కేసులో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సహజీవన భాగస్వామికి బెయిల్ మంజూరు చేసేక్రమంలో… ఉన్న‌త న్యాయ‌స్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదే క్రమంలో… వివాహ వ్యవస్థలో భాగస్వామితో నిజాయతీగా లేకపోవడం, సహజీవన సంబంధాలను కలిగి ఉండటం ప్రగతిశీల సమాజానికి సూచనలుగా ఇప్పుడు చెలామణీ అవుతున్నాయని హైకోర్టు తెలిపింది. అలాంటి ధోరణికి యువత ఆకర్షితులు కావడం పెరుగుతోందని ఆందోళ‌న వ్యక్తం చేసింది.

కాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇచ్చిన మాట తప్పాడని ఉత్తరప్రదేశ్‌ కు చెందిన 19 ఏళ్ల యువతి తన సహజీవన భాగస్వామిపై కేసు పెట్టింది. తాను గర్భవతినని, తీరా ఇప్పుడేమో తన భాగస్వామి పెళ్లికి అంగీకరించడం లేదని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తన భాగస్వామిపై అత్యాచార ఆరోపణలు కూడా చేసింది.

దీంతో ఈ విషయంపై స్పందించిన హైకోర్టు… ఇద్దరూ ఇష్టపూర్వకంగా సహజీవనం చేసిన తర్వాత.. ఇప్పుడు అత్యాచారం కేసు పెట్టడం ఏమిటని అలహాబాద్‌ హైకోర్టు మండిపడింది. ఈ సందర్భంగా సహజీవన వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది.