Andhra Pradesh Politics : కులాల కుంపట్లు.. మతాల సిగపట్లు.. ఇదేనా రాజకీయం.?

Andhra Pradesh Politics : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విపక్షాలూ ఒక్కతాటిపైకి వస్తున్నాయట.. ఓ సామాజిక వర్గం, ఈసారి ఎలాగైనా అధికార పీఠమెక్కాలనుకుంటోందట. మరో సామాజిక వర్గం అధికారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలుకోకూడదనుకుంటోందట. ఇంకో సామాజిక వర్గం, ప్రత్యర్థి రాజకీయ నాయకుల హత్యలకు సుపారీ ఇచ్చేందుకు సమాయత్తమవుతోందట. అంతేనా, మతం పేరుతోనూ చిచ్చు రాజేస్తున్నారట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలూ డబుల్ యాక్టివేట్ అయ్యాయి 2021 చివర్లో. అధికార పక్షం, విపక్షాలు.. అన్నీ తమ తమ దారుల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఎవరిది తప్పు.? ఎవరిది ఒప్పు.? అధికార పార్టీని ఓడించాలని విపక్షాలు అనుకోవడం కొత్తేమీ కాదు. విపక్షాల్ని నిలువరించేందుకు రాజకీయ ఎత్తుగడలు రచించడం అధికార పార్టీకీ కొత్తేమీ కాదు.

కానీ, ఈసారి కాస్త భిన్నంగా వున్నాయి పరిస్థితి. 2021 రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా వుండబోతున్నాయోగానీ, రాష్ట్ర అభివృద్ధి ఎవరికీ పట్టనట్టే కనిపిస్తోంది. కేంద్రాన్ని నిలదీయాల్సిన రాజకీయ పార్టీలు, చాలా ‘చీప్’గా గల్లీ రాజకీయాలు చేస్తున్నాయి. రాష్ట్రం పరువుని బజార్న పడేస్తున్నాయి.

ప్రత్యేక హోదా లేదు, రాదు.! కానీ, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎవరూ నిలదీయడంలేదు. ఇదో చిత్రం. దేశంలో ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి చాలా భిన్నంగా వుంది. అక్కడ ఆయా రాజకీయ పార్టీలు తమ రాష్ట్రాల అవసరాల కోసం పనిచేస్తున్నాయి.. అవసరమైతే పార్టీలకతీతంగా ఒక్కతాటిపైకి వస్తున్నాయి కూడా.

జిన్నా పేరుతోనూ ఏపీలో వక్ర రాజకీయాలు నడుస్తున్నాయంటే, ఏపీ భవిష్యత్ ఎలా వుండబోతోందన్న ఆందోళన ప్రజలకు కలగడంలో తప్పేముంది.?