అమరావతిపై జగన్ సర్కార్ ‘యూ టర్న్’ తప్పదా.?

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు తేల్చేసింది.. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టింది. దాంతో, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడాల్సి వస్తోంది. కేవలం ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో అమరావతి ప్రాజెక్టుని వైఎస్ జగన్ సర్కార్ అటకెక్కించిన విషయం విదితమే. పేరుకే అభివృద్ధి వికేంద్రీకరణ – మూడు రాజధానుల అంశం. కానీ, తెరవెనుకాల కథ వేరే. ఇప్పుడిక మొండితనం ప్రదర్శించాల్సిన అవసరమే లేదు. బేషజాలకు పోవాల్సిన అవసరం అసలే లేదు. మన రాష్ట్రం, మన రాజధాని.. అన్న భావనతో అమరావతి అభివృద్ధికి వైఎస్ జగన్ సర్కార్ కట్టుబడి వుండాల్సిందే. అదే రాష్ట్రానికి మేలు చేస్తుంది.

జగన్ సర్కార్ 2024 ఎన్నికల్ని ఎదుర్కోవడానికి పూర్తిగా రెండున్నరేళ్ళ సమయం మాత్రమే వుంది. ఈ రెండున్నరేళ్ళలో మూడు రాజధానుల నిర్మాణం అనేది అసాధ్యం. రెండున్నరేళ్ళలో అమరావతి మీద స్పెషల్ ఫోకస్ పెట్టగలిగితే, అద్భుతమైన రాజధాని కాకపోయినా.. ఓ మోస్తరు నగరంగా అమరావతి తయారవుతుందన్నది నిర్వివాదాంశం. కానీ, దానికి కావాల్సింది చిత్తశుద్ధి. సంక్షేమ పథకాల అమలు అవసరమే.. అదే సమయంలో, రాష్ట్రానికి రాజధాని కూడా అత్యంత అవసరం. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. రాష్ట్రం కోలుకోవాలంటే, అది రాజధానితోనే సాధ్యం. రాజధాని అంటూ నిర్మితమైతే, అక్కడ ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఎందుకంటే, ఆ రాష్ట్రానికి రాజధాని హైద్రాబాద్ వుంది. ఆంధ్రపదేశ్ సరిహద్దు రాష్ట్రాల్ని తీసుకుంటే.. కేవలం ఆంధ్రపదేశ్ మాత్రమే సరైన రాజధాని లేకుండా వుంది. ‘యూ టర్న్’ అనే ప్రస్తావన ఎంతవరకు సబబు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, తప్పదు, యూటర్న్ తీసుకోవాల్సిందే అమరావతి విషయంలో వైఎస్ జగన్ సర్కార్. అది రాష్ట్రానికి మేలు చేస్తుంది, వైసీపీకి రాజకీయంగానూ మేలు చేస్తుంది.