బంగాళాఖాతంలో మరోసారి వాతావరణం భయంకరంగా మారుతోంది. దిత్వా తుపాను ప్రస్తుతం శ్రీలంక భూభాగాన్ని దాటుకుని తిరిగి సముద్రంలోకి ప్రవేశించడంతో, అది మరింత బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గంటకు 65 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఈ తుపాను.. ఈ రోజే 85 నుంచి 90 కిలోమీటర్ల వేగం అందుకునే అవకాశాలు ఉన్నట్లు శాటిలైట్ అంచనాలు చెబుతున్నాయి. సముద్రంపైకి వచ్చేయడంతో అడ్డంకులు లేకుండా ఇది వేగంగా బలపడుతోందన్నదే అసలు ఆందోళనకర అంశం.
ఈ తుపాను ప్రస్తుతం ఉత్తరదిశగా కదులుతోంది. శనివారం రాత్రికి చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో, ఆదివారం ఉదయానికి 125 కిలోమీటర్ల దూరంలోకి చేరే అవకాశం ఉంది. అయితే చెన్నై వద్ద నేరుగా తీరం దాటే సూచనలు ప్రస్తుతం కనిపించడం లేదు. దిత్వా దారి మళ్లుతూ నెమ్మదిగా ఏపీ వైపు మళ్లే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రికి నెల్లూరుకు 159 కిలోమీటర్ల దూరంలోకి చేరే అవకాశాలున్నాయని లైవ్ ట్రాకింగ్ తెలియజేస్తోంది. ముఖ్యంగా చెన్నైకి సమీపంలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి దూరమై, ఏపీ వైపు దగ్గరవడం ఇప్పుడు ప్రజలను ఎక్కువగా కలవరపెడుతోంది.
దిత్వా ప్రభావంతో తమిళనాడులో డిసెంబర్ 1 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకూ మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 29, 30 తేదీల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఆదివారం మాత్రం కోస్తాంధ్ర, రాయలసీమ తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తోంది.
తెలంగాణలో వర్షం పడే సూచనలు లేకపోయినా, దిత్వా సుడులు ఆకాశం మీదుగా వెళ్లడం వల్ల చలిగాలులు తీవ్రంగా వీస్తాయి. మధ్యాహ్నం నుంచి మేఘాలు గట్టిగా కమ్ముకుని, సాయంత్రానికి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఈదురుగాలులతో జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
