‘అద్భుతం’ రివ్యూ -పాత ప్రేమకి కొత్త సైన్స్!

రేటింగ్: 2.25/5

Adbhutam Movie Review | Telugu Rajyam

దర్శకత్వం : మల్లిక్ రామ్

తారాగణం: తేజ సజ్జ, శివానీ రాజశేఖర్, సత్య, శివాజీ రాజా తదితరులు

కథ : ప్రశాంత్ వర్మ,

స్క్రీన్ ప్లే – మాటలు : లక్ష్మీ భూపాల,

సంగీతం: రథన్,

ఛాయాగ్రహణం : విద్యాసాగర్

బ్యానర్ : మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్ బ్యానర్

విడుదల: నవంబర్ 19, 2021

సైన్స్ ఫిక్షన్ ని జత చేసి ‘అద్భుతం’ అనే ఇంకో ప్రేమ సినిమా కొత్త వాళ్ళతో సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతోంది ఈ రోజు నుంచి. హీరో తేజ సజ్జా, హీరోయిన్ శివానీ రాజశేఖర్, దర్శకుడు మల్లిక్ రామ్ కొత్త వాళ్ళు. రొటీన్ ప్రేమ సినిమాలతో విసిగిన ప్రేక్షకులకి కాస్త డిఫరెంట్ గా సైన్స్ ఫిక్షన్ రోమాన్స్ ఉత్సాహాన్నిచ్చేదే. ‘అద్భుతం’ అని టైటిల్ కూడా వుంటే అద్భుత జర్నీలో తేలియాడే ఫీల్ కూడా పుట్టి, ఇంట్లోనే కదా థియేటర్ కేళ్ళే పని లేదుగా అని పిల్లా పాపలతో డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోవచ్చు అల్పాహారాలు పెట్టుకుని. ఇక ఒక మౌస్ క్లిక్ తో మొదలవుతుంది ఆట. అప్పుడుంటుంది అసలు తండ్లాట. అదేమిటో చూద్దాం…

కథ

సూర్య (తేజ సజ్జా) ఒక ఛానెల్లో పని చేస్తూంటాడు. ఒక రోజు ఆఫీసులో అయిన ఒక అనుభవంతో ఆత్మ హత్యకి సిద్ధపడతాడు. ఇంకో చోట వెన్నెల (శివాని) వుంటుంది. ఈమె కూడా ఒక కారణంతో ఆత్మహత్యకి పూనుకుంటుంది. ఇంతలో సూర్య సెల్ కి అతడి నెంబరుతోనే మెసేజి వస్తుంది. అది వెన్నెల సెల్ నుంచి వస్తుంది. తన నెంబర్ వెన్నెల దగ్గరెలా వుంది? తెలుసుకుంటే ఆమే తనూ వేర్వేరు కాలాల్లో వున్నట్టు తెలుస్తుంది. ఆమె 2014 లో, తను 2019 లో. ఇదెలా సాధ్యం? ఇప్పుడేం చేయాలి? ఇద్దరూ ఎలా కలుసుకోవాలి? అసలు ఇద్దరి మధ్య వున్న సంబంధమేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

వివిధ జానర్ల సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తూంటాయి. వాటిలో ప్రేమ కథలొకటి. ఈ ప్రేమ కథల్లో సైన్స్ ఎక్కువై ప్రేమ తగ్గినా, ప్రేమ ఎక్కువై సైన్స్ తగ్గినా, లేదా సైన్సే మిస్సయినా ఫలితాలు బావుండవు. సైన్స్ సృష్టించిన కథా ప్రపంచంలో ప్రేమ కథలుంటే రెండూ కలిపి అద్భుతంగా ఫీలవగల్గుతాం- మనమూ ఆ కాల్పనిక సైన్స్ ప్రపంచంలో విహరిస్తూ. ‘ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్ మైండ్’ (2005), ‘ఎబౌట్ టైమ్’ (2013), ‘ఐయాం యువర్ మాన్’ (2021) వంటివి కొన్ని. తెలుగులో ‘ఆదిత్య 369’ చూసినా మనం మొత్తం వేరే ప్రపంచంలో వున్నట్టు ఫీలవుతాం. అలా ఫీలయ్యేట్టు చేయకపోతే అది సైన్స్ ఫిక్షన్ కాదు.

‘అద్భుతం’ సైన్స్ ఫిక్షన్ జానర్లో లో భిన్న కాలాల టైమ్ జంబ్లింగ్ కథ. వేర్వేరు కాలాల్లో వున్న హీరో హీరోయిన్ల ఫోన్ కాల్స్ కలిసి మొదలయ్యే కథలు. ఆ మధ్య తెలుగులో ఇలా ‘ప్లే బ్యాక్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్, గత నెలలోనే ‘నేను లేని నా ప్రేమ కథ’ అనే రోమాన్స్ వచ్చాయి. ‘అద్భుతం’, ‘నేను లేని నా ప్రేమ కథ’ ఒకటే. రెండిటి ఇంటర్వెల్ సీన్లు ఒకటే. రెండిట్లోనూ ఎత్తుకున్న సైన్స్ ని వదిలేసి రోటీన్ ప్రేమ కథల్లోనే పడ్డారు. కాబట్టి ‘అద్భుతం’ ఏదో అద్భుతమనుకుంటే నిరాశ తప్పదు. వారం వారం వస్తున్న అవే పస ప్రేమ సినిమాల్లో ఇదీ ఒకటి.

‘నేను లేని నా ప్రేమ కథ’ లో కాలాల ఎడం 17 ఏళ్ళు వుంటుంది. దాంతో 1983 లో వుంటున్న హీరోయిన్ కథకి పీరియెడ్ లుక్ తో బాటు ఆమె కట్టూబొట్టూ, భాషా ఆ కాలంలోకి తీసికెళ్తాయి. ‘అద్భుతం’ లో కేవలం అయిదేళ్ళే కాలాల ఎడం. 2014 కీ, 2019 కీ తేడా వుండని కాలం. దీంతో రెండు కాలాల దృశ్యాలూ, పాత్రల తీరులూ ఒకలాగే వుంటాయి. సైన్స్ ఫిక్షన్ ఫీల్ కలగక పోవడానికి ఇదే ప్రధాన కారణం.

‘నేను లేని నా ప్రేమ కథ’ లో కనీసం కథనమైనా డైనమిక్ గా వుంది. అనేక చోట్ల ఓ ప్రశ్న రేకెత్తిస్తూ రీఫ్రెష్ అవుతూ పోయే కథనం. వీటితో మలుపులూ సస్పెన్సూ ఏర్పడే కథనం. ‘అద్భుతం’ లో ఇది కూడా లేదు. ఏ మలుపులూ సస్పెన్సూ లేని చాలా నీరసమైన పూర్ కథనంగా ఇది వుంటుంది.

ప్రేమ సినిమాలెన్ని తీసినా వాటికి ఎప్పటికప్పుడు వయసుకొచ్చిన యువ ప్రేక్షకులు వుంటూనే వుంటారు. అయినా తీస్తున్న ప్రేమ సినిమాలు ఫ్లాపవుతున్నాయంటే లేత కుర్రాళ్ళకి కూడా పట్టని ఓల్డ్ సరుకుగా అనిపిస్తున్నాయన్న మాట. సినిమాలు చూసే వయసు కొచ్చిన నేటి లేత కుర్రాళ్ళ ప్రపంచంలో కెళ్ళి నేటివైన ప్రేమ సినిమాల్ని ఆవిష్కరిస్తే తప్ప అద్భుతాలు జరగవు.

నటనలు- సాంకేతికాలు

తేజకిది మొదటి సినిమా. తర్వాత నటించిన సినిమా ముందు వచ్చి వుంటే వచ్చి వుండొచ్చు. ఈ మొదటి సినిమాలో నీటుగా ఆత్మవిశ్వాసంతో నటించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ వుంది. సీన్లు బాగా తీసివుంటే తనకి బావుండేది. పైపైన క్యారక్టర్ ని చిత్రించేయకుండా ఈ కథకి ప్రధాన పాత్రగా చేసి, ఒక గోల్, దాంతో డ్రైవ్ కల్పించి వుంటే స్క్రీన్ ప్లే ఇలా దెబ్బతీసేది కాదు తనని. ప్రారంభంలో ఆత్మహత్యా యత్నానికి బలమైన కారణం ఎలాలేదో, నటించడానికి అలా బలమైన కథ ఎక్కడా లేదు. సెకండాఫ్ లో ఫాదర్ సెంటి మెంటు, ట్రాజడీ కథని పక్కదోవ పట్టించాయే తప్ప తనకుపయోగ పడలేదు. హీరోయిన్ శివానితో ఫోన్ రోమాన్సు కూడా సాగి సాగి, వుండాల్సిన ప్రత్యక్ష రోమాన్స్ అప్పీల్ లేకుండా చేసింది.. రెండు పాటల్లో రోమాంటిక్ గా కంపించాడు.

కొత్త హీరోయిన్, అలనాటి హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ ఎమోషనల్ సీన్లలో కంటే మిగతా సీన్లలో హీరోని కేర్ చేయని పాత్ర నటించడంలో స్పీడు కనబర్చింది. తేజాకీ తనకీ భవిష్యత్తు వుంది. ఇక తేజ తండ్రిగా శివాజీ రాజా, శివానీ తండ్రిగా దేవీ ప్రసాద్, నానమ్మగా తులసి నటించారు. తేజ ఫ్రెండ్ గా సత్య బాగానే ఎంటర్ టైన్ చేస్తాడు కామెడీతో.

ప్రొడక్షన్ విలువలు, విజువల్స్ రిచ్ గా వున్నాయి అద్భుతం టైటిల్ కి తగ్గట్టు. మిగిలిన విషయాలే అద్భుతంగా లేవు.

చివరికేమిటి

పాత ప్రేమకి సైన్స్ ఫిక్షన్ సింగారం. నామ్ కే వాస్తే సైన్స్ ఫిక్షన్. అద్భుతమన్నాక ప్రతీ సీనూ పరవళ్ళు తొక్కుతూ అద్భుతాలు చేయాల్సింది పోయి- అద్భుత రసంతో లవ్ ని ఒక అడ్వెంచర్ గా చూపాల్సింది పోయి, చూసి చూసి వున్న అదే పాత రొటీన్ ప్రేమ డ్రామా కింద మార్చేశారు. కొత్త దర్శకుడి చేతిలో ఏమీ లేదు. ‘జాంబీ రెడ్డి’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథే తీశాడు.

ఫస్టాఫ్ ఫోన్ కాల్స్ తోనే లవర్స్ ఇద్దరికీ సరిపోతుంది. తాము వేర్వేరు కాలాల్లో వున్నట్టు తెలుకోవడానికి వాళ్ళాకీ, మనకీ చాలా సమయం పడుతుంది. ప్రారంభంలో ఆత్మహత్యా యత్నం సీన్లోనే అలా మెసేజెస్ రావడంతో ఇద్దరూ వేర్వేరు కాలాల్లో వున్నట్టు ఓపెన్ చేసేసి మలుపు తిప్పి వుంటే ఫస్టాఫ్ బోరు అంతా తప్పేది. విషయం లేక ఇంటర్వెల్ వరకూ ఫ్లాట్ గా కథ నడుస్తూంతూమ్ది. విషయం తెలిశాక సెకండాఫ్ లో హీరో పాత ప్రేమ ఫ్లాష్ బ్యాకు వస్తుంది. గతంలో ఇద్దరూ ప్రేమికులేననీ తెలిపే ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక ఇద్దరూ ఇప్పుడు కలుసుకునే కథ. ఈ కథని టైమ్ జంబ్లింగ్ సైన్స్ ఫిక్షన్ కథ చేయకుండా, ఐదేళ్ల క్రితం విడిపోయిన లవర్స్ తిరిగి కలుసుకునే కథగా చేసినా తేడా ఏమీ రాదు. ఇంకో విషయమేమిటంటే టైమ్ జంబ్లింగ్ పాయిటు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం. ఇంత అద్భుతంగా సినిమా చూపిస్తే ఎందుకు చూడరు ప్రేక్షకులు?

—సికిందర్

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles