Formula E Car Race Case: ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు మరో షాక్

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి ఆంటికరప్షన్ బ్యూరో (ఏసీబీ) దృష్టి కేంద్రీకరించింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఫార్ములా ఈ-రేసింగ్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా కేటీఆర్‌ను ఈ నెల 6న ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించింది. దీంతో ఈ కేసు దర్యాఫ్తు మరింత వేడెక్కింది.

ఫార్ములా ఈ-ఆపరేషన్స్ లిమిటెడ్, తెలంగాణ మున్సిపల్ శాఖ మధ్య కుదిరిన ఒప్పందంలో పలు అనుమానాస్పద అంశాలు ఉన్నాయని ఏసీబీ అభిప్రాయపడుతోంది. ఇందులో ఒప్పంద ఉల్లంఘనలపై విస్తృతంగా పరిశీలన చేపట్టింది. ముఖ్యంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసు దర్యాఫ్తు వేగం అందుకుంది. ఇటీవల కిశోర్‌ను ఏసీబీ ఏకంగా ఏడు గంటల పాటు ప్రశ్నించగా, పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దర్యాఫ్తు ప్రక్రియలో భాగంగా మున్సిపల్ శాఖ నుంచి సేకరించిన వివరాలపై ఏసీబీ ముఖ్యంగా దృష్టి పెట్టింది. ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహణలో అనేక ఖర్చుల సాకులు చూపి అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రాథమిక ఆధారాల ఆధారంగా కేటీఆర్‌ను విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఏసీబీ జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేగింది. కేటీఆర్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఈ కేసులో ఇతర కీలక వ్యక్తులను కూడా విచారించే అవకాశమున్నట్లు సమాచారం. ఏసీబీ విచారణ అనంతరం కేసు మరింత సీరియస్ దశకు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.