తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయినా ఖుష్బూ సుందర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో తరచుగా ఆమె ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం ఈమె బీజేపీ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇది ఇలా ఉంటే గతంలో చాలా సందర్భాలలో ఖుష్బూ సుందర్ తన తండ్రి గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ విషయం గురించి ఆమె తెలిపారు. తన తండ్రి కారణంగా తనతో పాటు తన కుటుంబం తన తల్లి సోదరులు చాలా చిత్రహింసలు అనుభవించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ.. నా చిన్న తనంలోనే నేను లైంగిక దాడిని ఎదుర్కొన్నాను. నా తండ్రే నాపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. నా తల్లి, సోదరులను చిత్ర హింసలు పెట్టేవాడు. బెల్టు, చెప్పులు, కర్ర ఇలా చేతికి ఏది దొరికితే దానితో కొట్టేవాడు. కొన్ని సార్లు అమ్మను మరీ దారుణంగా హింసించేవాడు. ఆమె తలను గోడకేసి కొట్టేవాడు. చిన్న తనంలోనే నేను ఇలాంటి దారుణమైన వేధింపులు చూశాను. నాపై జరుగుతోన్న దాడి గురించి బయటకు చెబితే వాళ్లను ఇంకెంత నరకయాతనకు గురి చేస్తాడోనని భయపడ్డాను. అందుకే మొదట్లో ఏమీ మాట్లాడలేక ఎన్నో దారుణాలు భరించాను. చెన్నైకు వచ్చి నా కాళ్ల పై నేను నిలబడిన తర్వాత నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఆ తర్వాతే ఆయనకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను. దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు.
షూట్ కు వచ్చి అందరి ముందు నన్ను బాగా కొట్టేవాడు. ఉబిన్ అనే ఒక హెయిర్ డ్రెస్సర్ నాకెంతో సాయం చేసింది. నాతో ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని ఆమె గుర్తించింది. నా నుంచి విషయం తెలుసుకొని ధైర్యం చెప్పింది. అలా మొదటిసారి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు లైంగిక వేధింపుల గురించి బయటకు వచ్చి మాట్లాడాను. ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో మాకు తెలియదు. నేను కనుక్కోవాలనుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన్ని కలవలేదు. గతేడాది ఆయన మరణించాడని తెలిసినవాళ్లు చెప్పారు అని ఖుష్బూ చెప్పుకొచ్చింది.