పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’ ట్రైలర్ విడుదల

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్ మరియు మై డియర్ మార్కండేయ, జానవులే పాటలకు వచ్చిన స్పందనతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేశారు. ఒకేసారి రెండు చోట్ల ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించడం విశేషం. వైజాగ్ లోని జగదాంబ థియేటర్‌ లో, హైదరాబాద్‌లోని దేవి థియేటర్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమాలు నిర్వహించారు. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, సముద్రఖని, ఎస్ థమన్ మరియు టీజీ విశ్వ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వైజాగ్ జగదాంబ థియేటర్‌ లో జరిగిన వేడుకలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “మీ ప్రేమ పొందటం కోసమే ఇంత దూరం వచ్చాను. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం సంతోషంగా ఉంది. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అభిమానులకి ఏమైనా జరిగితే మేం తట్టుకోలేము” అన్నారు. అలాగే “నాకు కొంచెం తిక్కుంది” అంటూ తన మేనమామ పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ ని చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు సాయి ధరమ్ తేజ్.

ట్రైలర్ మిమ్మల్ని ఎంతగా అలరించిందో, దానికి వంద రెట్లు సినిమా అలరిస్తుందని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ అన్నారు.

హైదరాబాద్‌ దేవి థియేటర్‌ లో జరిగిన వేడుకలో సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. “చాలా మంచి సినిమా ఇది. సినిమా ఫలితం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. మీరు దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ గారు దేవుడిగా నటించిన సినిమా ఇది. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది.” అన్నారు.

ఈ సినిమా కోసం అందరిలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిదని కథానాయిక కేతిక శర్మ అన్నారు.

ట్రైలర్ కేవలం శాంపిల్ మాత్రమే అని, సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయని, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని సంగీత దర్శకుడు థమన్ అన్నారు.

తనకు జీవితంలో దేనికీ సమయం లేదంటూ ప్రతి దానికి కంగారు పడుతూ ఇంట్లోనూ, పని దగ్గర హడావుడిగా ఉండే సాయి ధరమ్ తేజ్‌ పాత్రని చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. కేతికా శర్మ అతని ప్రేయసిగా కనిపిస్తుంది. ఒక దుర్ఘటన మరియు సమయానికి ప్రాతినిధ్యం వహించే పవన్ కళ్యాణ్ రాక తర్వాత, అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది.

పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా, కూలీగా(తమ్ముడు చిత్రంలోని లుక్ ఆధారంగా) విభిన్న అవతారాల్లో కనిపిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ఎప్పుడూ అతని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. పవన్ కళ్యాణ్ ఎంతో సరదాగా గడుపుతుండగా, సాయి ధరమ్ తేజ్ మాత్రం గందరగోళంగా, కలవరపడుతున్నట్లు కనిపిస్తాడు. వారు ఎప్పుడూ కలిసి ఎందుకు కనిపిస్తారని చాలామంది ఆశ్చర్యపోతారు.

సాయిధరమ్ తేజ్‌కి గతంలోకి వెళ్లే అరుదైన అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం మరియు జీవితం, మరణం గురించి చెప్పిన మాటలు కట్టిపడేస్తున్నాయి. ఇందులో ఎమోషన్, కామెడీ, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. సాయిధరమ్ తేజ్‌ని ఆందోళనకు గురి చేసేలా అతని కుటుంబం చుట్టూ సంఘర్షణ జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

కింగ్ సినిమాలోని బ్రహ్మానందం యొక్క ఐకానిక్ డైలాగ్‌ను పవన్ కళ్యాణ్ రీక్రియేట్ చేయడం, జల్సా స్టెప్ వేయడం మరియు సాయి ధరమ్ తేజ్‌ తో కలిసి కాలు కదపడం వంటి అందమైన మూమెంట్స్ తో ట్రైలర్ ను ముగించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. అలాగే తనకు లిప్‌స్టిక్‌ రుచి కూడా తెలియదని పవన్‌ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ చెప్పడం నవ్వులు పూయించింది.

డ్యాన్స్ స్టెప్పులు, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఈ చిత్రం ప్రేక్షకులకు వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేస్తుంది. సముద్రఖని కథ విషయంలో రాజీ పడకుండా అభిమానులను మెప్పించేలా సినిమాను అద్భుతంగా రూపొందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్ మరియు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి ప్రధాన బలంగా నిలిచాయి.

జూలై 28న ప్రేక్షకుల కోసం వినోదభరితమైన విందు ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ కనిపిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ కనిపిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వీ రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: సెల్వ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
కో-డైరెక్టర్: బి. చిన్ని
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

BRO Trailer | Pawan Kalyan | Sai Tej | Trivikram | Samuthirakani | ThamanS | July 28th Release