Amit Shah: నక్సలిజంపై కేంద్రం టార్గెట్.. అమిత్ షా షాకింగ్ కామెంట్!

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, మార్చి 2026 నాటికి దేశం నక్సల్‌ సమస్య నుంచి పూర్తిగా విముక్తి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుండి నక్సలిజం నుండి బయటపడిన మాజీ సభ్యులు పాల్గొన్నారు.

గతేడాది భద్రతా బలగాలు 287 మంది నక్సల్స్‌ను హతమార్చగా, 1000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. 837 మంది నక్సల్స్ ప్రభుత్వానికి లొంగిపోయారని అమిత్ షా వివరించారు. నక్సలిజంపై నరేంద్రమోదీ సారథ్యంలో ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి కారణంగా, దేశవ్యాప్తంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తీవ్రత గణనీయంగా తగ్గిందని అన్నారు.

భద్రతా బలగాల అంకితభావం, ప్రజల సహకారం వల్ల నక్సలిజం రూపుమాపన దిశగా చారిత్రక విజయాలు సాధిస్తున్నామని హోంమంత్రి పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ పోలీసులు నక్సలిజం వ్యతిరేకంగా చేసిన కృషి ప్రశంసనీయమని, వారి సేవలను దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హింసా మార్గాన్ని విడిచిపెట్టి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మిగిలిన నక్సలైట్లను కూడా అమిత్ షా ఆహ్వానించారు. నక్సలిజానికి ముగింపు పెట్టి, దేశ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, అందులో ప్రతి పౌరుడి సహకారం అవసరమని హోంమంత్రి అన్నారు.