ఏపీలో మరోసారి కలిసి పోటీ చేయాలని టీడీపీ – బీజేపీ నిర్ణయించుకున్నాయి. 1999 నుంచి చెబుతున్నట్లుగానే ఈ పొత్తు ఏపీ ప్రయోజనాల కోసం అని చంద్రబాబు క్యాజువల్ గా ప్రకటన కూడా చేసేశారు. ఇక వారిదే విజయం అని ఒక వర్గం మీడియా వాయించి వదులుతుంది. ఆ సంగతి అలా ఉంటే… బీజేపీతో పొత్తు విషయంలో ఒక సెంటిమెంట్ ఇప్పుడు తమ్ముళ్లను టెన్షన్ పెడుతుందని అంటున్నారు.
అవును… ఏపీలో బీజేపీ – టీడీపీల మధ్య పొత్తు రిలేషన్ ఈ నాటిది కాదు. చంద్రబాబు టీడీపీని హస్తగతం చేసుకున్నప్పటినుంచీ ఈ బంధం దఫదఫాలుగా కొనసాగుతుంది. ఏపీ ప్రయోజనాల కోసం అని చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలవడం, వారితో పొత్తు పెట్టుకోవడం.. అనంతరం ఆయనే దాన్ని బ్రేక్ చేయడం.. బీజేపీతో పొత్తు చారిత్రకతప్పిదం అని ప్రకటించడం తెలిసిందే.
అసలు 2004లో ఓటమి తర్వాత అయితే… బీజేపీ వంటి మతతత్వ పార్టీతో జీవితంలో పొత్తుపెట్టుకోమని కూడా బాబు ప్రకటించారు. తిరిగి 2014లో పెట్టుకున్నారు. ఇలా సుమారు పాతికేళ్లుగా సాగుతున్న ఈ పొత్తు విన్యాశాల చరిత్ర.. ఆ చరిత్రతో మిళితమైన ఒక సెంటిమెంట్.. అందుకు తమ్ముళ్లు పడుతున్న టెన్షన్ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం…!
1999లో చంద్రబాబు తొలిసారిగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.. వాజపేయి ప్రధాన మంత్రి అయ్యారు. ఇక్కడ ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని అనలేదు కానీ… భారత్ వెలిగిపోతుందని ఒకరంటే… ఆ వెలుగులు ఏపీపై కూడా విపరీతంగా పడుతున్నాయని మరొకరు అన్నారు. ఏమి వెలిగిందనేది ప్రజలకు తెలిసిన సంగతే!
అనంతరం 2004లో వైఎస్సార్ ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు మరోసారి బీజేపీతో జతకట్టారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004, 2009లో వైఎస్సార్ సీఎంగా పనిచేశారు. ఆయన మరణానంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్తా విడిపోయింది. దీంతో మరోసారి బాబు పొత్తుకు డోర్స్ ఓపెన్ చేశారు. 2014లో బీజేపీతో మరోసారి కలిసి పోటీ చేశారు. సక్సెస్ అయ్యారు!
ఆ పొత్తు కాపురం నాలుగేళ్లకే పెటాకులైంది. అనంతరం మోడీ, అమిత్ షా లను ఏస్థాయిలో అవమానించాలో బాబు ఆ స్థాయిలో అవమానించారు. తాను మోడీ కంటే సీనియర్ అని చెప్పారు.. ఆయనకు భార్యా పిల్లాలూ లేరనే విషయాన్ని పరోక్షంగా ప్రస్థావించారు. ఇక అమిత్ షా కి ఏపీలో బాబు హయాంలో జరిగిన అవమానాలకు వెంకటేశ్వర స్వామే సాక్ష్యం అని కూడా బీజేపీ నేతలు చెబుతుంటారు.
కట్ చేస్తే… 2024లో మరోసారి బాబు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో సెంటిమెంట్ గుర్తొచ్చి టెన్షన్ పడుతున్నారు తమ్ముళ్లు. కారణం… 1999లో పొత్తులో గెలిచారు.. 2004లో అదే పొత్తులో ఓడారు.. 2014లో పొత్తు పెట్టుకుని గెలిచారు.. 2024లో అదే పొత్తులో ఏమవుతుందనేది ఇప్పుడు వారి టెన్షన్ గా ఉందని తెలుస్తుంది! మరి 2004లో జరిగినట్లే జరుగుతుందా… లేక, సరికొత్త చరిత్ర క్రియేట్ అవ్వబోతుందా అనేది వేచి చూడాలి!!