కన్నప్పలో ప్రభాస్.. రన్ టైమ్ ఎంత?

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వేగంగా కొనసాగుతోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ కోసం మంచు విష్ణు, మోహన్ బాబు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి స్టార్ క్యాస్ట్ ఉండడం ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలను పెంచుతోంది.

ప్రభాస్ సినిమాల్లో నటించేందుకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటాడని తెలిసినప్పటికీ, ఈసారి మాత్రం మంచి అనుబంధం కారణంగా ప్రభాస్ ‘కన్నప్ప’ చిత్రంలో రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ పాత్ర గెస్టు అప్పియరెన్స్‌ మాత్రమే అని తెలుస్తోంది. మేకర్స్ మొదట ప్రభాస్‌కు ఎక్కువ నిడివి ఉన్న పాత్రను ప్రతిపాదించినప్పటికీ, అతని బిజీ షెడ్యూల్‌ల కారణంగా ఇది కుదరలేదు. ఆ పాత్రను కేవలం ఐదు నిమిషాల నిడివికి పరిమితం చేశారు.

ఈ ఐదు నిమిషాల పాత్రలోనే ప్రభాస్ తన సత్తా చూపేలా కనిపిస్తాడని చిత్ర బృందం చెబుతోంది. సినిమాలో నందీశ్వరుడిగా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ పాత్ర కోసం గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ సహాయంతో ప్రభాస్ సీన్స్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో లీకైన లుక్‌కు మంచి స్పందన రావడం వల్ల, మేకర్స్ ఇప్పుడిక చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

‘కన్నప్ప’ చిత్రంలో మోహన్ లాల్ కీలకమైన కిరాత పాత్రలో కనిపించనుండగా, అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్నాడు. సినిమా విడుదల తేదీగా 2025 ఏప్రిల్ 25ను మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్ పాత్ర తక్కువ నిడివి కలిగి ఉన్నప్పటికీ, ఆ సీన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేలా ఉండనున్నాయని సమాచారం. ఈ ప్రత్యేక ఆకర్షణ సినిమాపై మరింత క్రేజ్ తెస్తుందని అంటున్నారు.