Ilayaraja: ఆలయంలో ఇళయరాజాకు అవమానం.. గర్భగుడిలో వివాదం.. అసలు ఏం జరిగిందంటే?

Ilayaraja: తెలుగు ప్రేక్షకులకు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన మధురమైన సంగీతంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపుగా 50 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో ఎన్నెన్నో అవార్డులు పురస్కారాలు గౌరవాలు కూడా సొంతం చేసుకున్నారు ఇళయరాజా. ఆయన అందించిన సంగీతం ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. తెలుగు తమిళం సినిమాలకు మంచి మంచి సంగీతాన్ని అందించి రెండు భాషల్లో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇళయరాజా కు తమిళనాడులోని ఒక ఆలయంలో అవమానం జరిగింది. ఈ విషయంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

ఇళయరాజాకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయంలో అవమానం జరిగింది. ఆలయ సందర్శనలో భాగంగా ఇళయరాజా గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జీయర్‌ స్వామీజీలు ఇళయరాజాను అక్కడ నుంచి వెనక్కి పంపించారు. దాంతో ఆయనను అడ్డుకొని వెనక్కి పంపించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇళయరాజా గుడి నుంచి బయటకు వచ్చిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది ఇళయరాజాకి జరిగిన ఘోర అవమానం అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆలయ అధికారులు స్పందించారు.

శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయంలో ఇళయరాజాకి అవమానం జరిగిందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను వారు కొట్టిపారేశారు. ఆయనకు పూర్తి గౌరవ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించామని వారు అన్నారు. అయితే అర్ధ మండపం నుంచి బయటకు పంపించడంను సమర్ధించారు. జీయర్‌ లకు మాత్రమే ఎంట్రీ ఉన్న అర్ధ మండపంలోకి తెలియకుండా ఇళయరాజా గారు వెళ్లారు. ఆయనకు విషయం చెప్పిన వెంటనే బయటకు వచ్చారు. ఆండాళ్‌ స్వామి వారిని బయట నుంచి దర్శించుకున్నారు, జీయర్‌ ల నియమాలు, ఆలయ నిబంధనలకు అనుగుణంగా అక్కడ ఇళయరాజా గారు మండపం నుంచి బయటకు వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ నియమాలకు విరుద్ధంగా ఇతరులు ఎవరూ మండపంలోకి వెళ్లకూడదు. జీయర్‌లకు మాత్రమే ప్రవేశం ఉన్న విషయం స్థానికులు అందరికీ తెలుసు. ఈ విషయంలో ఇళయరాజా గారిని అవమానించడం తమ ఉద్దేశం కాదని, ఆయనపై తమకు గౌరవ మర్యాదలకు కొదువ లేదు అంటూ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఈ విషయంపై ఇళయరాజా ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.