రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ – జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందా రాదా అనే విషయాలపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించుతూ… బీజేపీ కూడా వచ్చి చేరింది. దీంతో ఏపీలో 2014 తరహా ఫలితాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. మరోపక్క ఆనాటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు.. నాడు ఏపీకి చేసిందేమిటి, ఎందుకు విడిపోయారో చెప్పి ఓట్లు అడగాలని వైసీపీ చెబుతుంది! ఈ సమయంలో చంద్రబాబుపై బీజేపీ కీలక నేత అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి వైరల్ గా మారాయి.
అవును… తాజాగా ఇండియా టుడే కాంక్లేవ్ భాగంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా ని యాంకర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఇందులో భాగంగా… “గతంలో ప్రధాని మోడీని టెర్రరిస్ట్ అని చంద్రబాబు అన్నారు.. అటువంటి వ్యక్తితో మీరు ఎలా పొత్తు పెట్టుకున్నారు” అని అడిగారు. ఈ సమయంలో దీనికి అమిత్ షా ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పొత్తు వెనుకున్న పరమార్ధం అర్ధం అయ్యిందనే చర్చా తెరపైకి వచ్చింది.
ఈ ప్రశ్నకు సమాధానంగా స్పందించిన షా… “ప్రధాని మొడీని టెర్రరిస్ట్ అని చంద్రబాబు ఎన్ డీయే నుంచి బయటకు వెళ్లిపోయారు. మేము ఆయనను వెళ్లమనలేదు. అనంతరం ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో బాబుకు బుద్దొచ్చింది. అంతే… తిరిగి ఎన్ డీయేలో కలుస్తామంటూ మా వద్దకు వచ్చారు.. ఆయనను కలుపుకున్నాం!” అని అన్నారు. దీంతో… ఈ సమాధానికి అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టగా… ఏపీలో మాత్రం సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.
వాస్తవానికి టీడీపీ – జనసేన పొత్తులో బీజేపీ కలవాలని ప్రయత్నిస్తుందని.. ఎన్ డీయేలో చేరాలని బీజేపీనే టీడీపీకి ఆహ్వానం పంపిందని.. ఈ సమయంలో బీజేపీకి చంద్రబాబు పలు షరతులు కూడా పెట్టారని ఒక వర్గం మీడియా చెప్పుకొచ్చింది. అయితే… అదంతా ఫేక్ అని, చంద్రబాబుకే బుద్ది వచ్చి తిరిగి ఎన్ డీయేలో చేరడానికి తమను కలిశారని అమిత్ షా కుండబద్దలు కొట్టడంతో… ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో… జగన్ ను ఓడించాలనో.. తాము ఓడిపోకూడదనో.. ఓడిపోయినా జైలు పాలవ్వకుండా తోడు దొరుకుతుందనో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని… రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి అనేవి వట్టిమాటలని స్పష్టమైందని వైసీపీ నేతలు కామెంట్లు మొదలుపెట్టేశారు. మరి అమిత్ షా వ్యాఖ్యలపై చంద్రబాబు & కో ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.