అభినందన్ విడుదల : పాక్ కు అంత మంచి బుద్ధెలా వచ్చింది?

తమ నిర్బంధంలో ఉన్న భారత్ పైలట్ అభినందన్ వర్తమాన్ ని శుక్రవారం విడుదల చేస్తామని పాకిస్తాన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరించారు.

నిజానికి అభినందన్ విడుదల వివాదం ఇంకా కొంతకాలం నానుతుందని అనుకున్నారు. విడుదల గురించి కనీసం సూచనలు కూడా లేవు.

ఒక వైపు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి విడుదల గురించి బీరాలు పోతున్నాడు. భారత్ ఉద్రికత్తను సడలించే గ్యారంటీ ఉంటేనే విడుదల చేస్తామని ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఈ మెలిక ప్రకటన ఇంకా బ్రేకింగ్ గా టివిల్లో వస్తూనే ఉంది. పాక్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో హర్షధ్వానాల మధ్య భారత్ పైలట్ ను రేపు విడుదల  చేస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.

విడుదల చేయడమంటే తాము బలహీనులమనో, భయపడ్డామనో అనుకోవద్దు, ఇది కేవలం స్నేహ పూర్వక చర్య అని వర్ణించుకున్నారు. మరొక వైపు ఇండియా కూడా మూడోదేశం జోక్యం అనుమతించం, అదేదో మేమే తెల్చుకుంటామని చెబుతూనే ఉంది.

అలాంటపుడు అభినందన్ ను విడుదల చేస్తామని ఇమ్రాన్ ప్రకటించారు. అంతేకాదు, భారత్ అందించిన జెయిష్ ఇ మహమ్మద్ పుల్వామా ఆత్మాహుతి దాడితో ఉన్న సంబంధం చూపే చిట్టా విప్పి చదవుతామని ఖురేషి ప్రకటించారు.ఒకటి రెండు గంటల వ్యవధిలో పాకిస్తాన్ ఇంతగా దిగిరావడానికి కారణమేమిటి?

పాక్ ప్రధాని ప్రకటన వెనక ఏం జరిగింది?

చాలా అంతర్జాతీయ శక్తులు పాకిస్తాన్ మెడపట్టి దారికి తీసుకువచ్చాయి. నిజానికి మూడు సంపన్నదేశాలు, అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండు లు తీవ్రవాదానాకి ఊతమిస్తున్నదేశంగా పాకిస్తాన్ ని చూస్తాయి, ఈ మూడు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి నోటీసు ఇస్తూ పాకిస్తాన్ పంచన హాయిగా వర్ధిల్లుతున్న జెయిష్ చీఫ్ మసూద్ అజర్ను తీవ్రవాదిగా ముద్రవేయాలని కోరాయి. అమెరికా నేతృత్వంలో ఈ లేఖ భద్రతా మండలికి చేరుకున్నాక పరిణామాలు చకచకా సాగిపోయాయి. వీటి మీద ‘ది హిందూ’ ఆసక్తి కరమయిన కథనమొకటి ప్రచురించింది. అవేంటో చూద్దాం.

ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, సౌదీ అరెబియా ఇపుడు ప్రపంచంలో నాన్ మిలిటరీ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతూ ఉందన్న విషయం మర్చిపోరాదు.ఆ  దేశంతో ప్రపంచానికి చాలా అవసరాలున్నాయి. అందుకే ఆదేశం సలహాని అంత ఈజీగా కాదనేస్థితలో ఏ దేశంలేవు. ఇది వేరే విషయం.

నిన్నటి హఠాత్పరిణాాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్  వియత్నాం రాజధాని హనోయ్ లో చేసిన ప్రకటనతో మొదలయ్యాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఊన్ తో చర్చల కోసం ఆయన హనోయ్ కు వచ్చారు. ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత అక్కడి నుంచే ఆయన ఇండో పాక్ ఉద్రిక్త వాతావరణ మీద దృష్టి పెట్టారు.

తమ రాయబారులను, సీనియర్ అధికారులను రంగంలోకి దించి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ తగ్గించేందుకు కృషి చేయండని పురమాయించారు. ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ‘ఇండియా పాకిస్తాన్ లు రెండూ యుద్దంవైపు అడుగులేస్తున్నట్లున్నాయి. వాళ్లిని అడ్డుకునేందుకు మేం కృషి చేస్తూనే ఉన్నాం. ఈ (ఉద్రిక్త) పరిస్థితి ముగింపుకు వస్తుందని విశ్వసిస్తున్నాం, దీనికి సంబంధించిన శుభవార్త వింటాం. కొంత సర్దుబాటు జరిగేందుకు, శాంతినెలకొనేందుకు వాళ్లకి కొంత సాయం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం… ,’ అని ట్రంపు ప్రకటించారు. ఈ ప్రకటన విడుదల చేస్తున్నపుడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ట్రంప్ పక్కనే ఉన్నారు. ఆయన వెంటనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో  ఉద్రిక్త వాతావరణ గురించి చర్చించారని ‘ది హిందూ’ రాసింది. దీనిని బట్టి తెరవెనక  ఎలాంటి  వత్తిడి మొదలయిందో తెలుస్తుంది.

మరొక వైపు సౌదీ విదేశాంగ ఉప మంత్రి ఎదెల్ ఎల్ జుబేర్ తాను ఒక ముఖ్యమయిన సందేశంతో ఇస్లామాబాద్ వెళ్తున్నానని ప్రకటించారు.

ఇక ఢిల్లీలో సౌదీ రాయబారి సౌద్ ఎల్ సాటి ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు.

ఇక సింగపూర్ లో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధాని, యువరాజు అబుదాబి మొహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్లో మోదీతో, ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడారు. అంతేకాదు, ఎందుకయినా మంచిదని ఆయన తాను మాట్లాడిన విషయాన్ని, ఇటీవలి పరిణామాల మీద విజ్ఞతతో వ్యహరించాలని, చర్చలకు, సమావేశాలకు ప్రాముఖ్యం ఇవ్వాలని తాను సూచన చేశానని ట్విట్టర్ లో కూడా పెట్టారు.

ఇటీవల భారత్ సందర్శించిన సౌదీ యువరాజు, యుఎఇ యువరాజలకు ఇండియా పాకిస్తాన్ ల మధ్య నెలకొన్నఉద్రిక్త వాతావరణ అందోళన కలిగించింది. ఈ రెండు దేశాలకు ఇండియా, పాక్ లలో భారీ ప్రయోజనాలున్నాయి. ఈ రెండు దేశాలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇండియా పాకిస్తాన్ లు ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం కాకూడదని వారి కోరిక. అందువల్ల ఇండో పాక్ ఉద్రికత్త యుద్ధం దాకా దిగజారరాదని నిర్ణయించుకుని తమ పలకుబడినంతా కూడదీసుకుని రెండు దేశాలను వప్పంచాయి. అభినందన్ ను విడదలచేయడం మొదటి చర్య, ముఖ్యమయిన చర్య. ఎలాంటి పొగకూడా లేకుండా హఠాత్తుగా ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో చేసిన ప్రకటన, ఆయన స్నహ పూర్వకం అని వర్ణించినా, అంతర్జాతీయ వత్తిడి వల్లే నని అర్థమవుతుంది. పాకిస్తాన్ ను తీవ్రవాదం విషయంలో ఏకాకిని చేయడంలో కొంతవరకు భారత్ విజయవంతమయిందని తప్పదు.