మన దాయాది దేశం పాకిస్తాన్ లో ఎప్పుడు ఎదో ఒక రూపంలో అశాంతి జ్వాలలు రగులుతూనే ఉంటాయి. ఎంత మంది అధ్యక్షులు వచ్చిన కానీ, పాక్ తీరులో ఎలాంటి మార్పు రావటం లేదు. పాక్ లో పేరుకు మాత్రమే ప్రజాస్వామ్య బద్దమైన ప్రభుత్వం ఉంటుంది, కానీ అధికారాలు మాత్రం సైన్యం చేతిలో ఉంటాయి , ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా సైనికుల చేతిలో కీలుబొమ్మ అనే తెలుస్తుంది. దీని గురించి స్వయంగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ పేరుకే ప్రధాని తప్ప, దేశ పరిపాలన మొత్తం సైన్యం చేస్తుందని విమర్శించాడు. అది నచ్చని సైన్యం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసింది.
దీని వెనుక సైన్యం హస్తముంది. దీనిపై విపక్షాలు మండిపడుతూ పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి నాయకుడిగా షరీఫ్ మేనల్లుడు అవాన్ ను ఎంచుకున్నారు. ఆయనా బయట ఉంటే ఉద్యమం తీవ్రం అవుతుందని భావించిన సైన్యం వెంటనే ఆయన్ని బంధించాలని , సింధు ప్రావిన్స్ యొక్క పోలీస్ ఉన్నతాధికారిని ఆదేశించింది. ప్రభుత్వం నుండి సమాచారం లేదని అయన దీనికి స్పందించకపోవటంతో, ఏకంగా సైన్యమే అవాన్ బంధించి తీసుకోని వెళ్ళింది, ఈ ఒక్క ఉదాహరణే చాలు పాక్ లో ఎలాంటి పరిపాలన సాగుతుందో చెప్పటానికి.
ఇవన్నీ గమనిస్తే పాక్ లో సైనిక పాలన రావటానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని తెలుస్తుంది. మరో పక్క అంతర్జాతీయంగా పాకిస్తాన్ నిధులు తీసుకోవాలంటే FATF నుండి అనుమతి తప్పనిసరి, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయం చేస్తుందని, దేశంలో సరైన పాలనా సాగించటం లేదని ఆరోపిస్తూ FATF సంస్థ పాకిస్తాన్ ను “గ్రే” లిస్ట్ లో పెట్టింది. దీనితో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా ఎలాంటి నిధులు వచ్చే అవకాశం లేదు. దేశంలో ఆర్థిక ప్రగతి అనుకున్న స్థాయిలో లేదు, కేవలం అప్పుల మీద ఆధారపడి దేశాన్ని నడిపించాల్సి వస్తుంది. ఒక పక్క సైనిక పాలన, మరో పక్క ఆర్థిక సమస్యలు వెరసి పాకిస్తాన్ దివాళా దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెపుతున్నారు.