‘పుష్ప-2’ కోసం నిర్విరామ కృషి.. సమయానికి విడుదల చేసేలా టార్గెట్‌!

ఆగస్ట్‌ 15న ‘పుష్ప2’ చిత్రం విడుదల పక్కా అని తేదీ ప్రకటించినప్పటికీ ఇంకా విడుదల అనుమానమే అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్ని గాసిప్‌లు వచ్చినా సుకుమార్‌ మాత్రం ఆయన పనిలో ఆయన బిజీగా గడుపుతున్నారు. కారణం ఆగస్ట్‌ 15న సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలి. అదే ఆయన ముందున్న టార్గెట్‌. దాని కోసం రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారు.

’పుష్ప 2’ ఆగస్టు 15న రాదని, ఆలస్యం అవుతుందని రకరకాల రూమర్లు వస్తున్నా అవేం పట్టించుకోకుండా ముందుకు పోతున్నారు లెక్కల మాస్టారు. పోస్టర్‌లోనూ, టీజర్‌లోనూ ఆగస్టు 15నే వస్తున్నాం అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇచ్చిన మాటకు, అనుకున్న టైమ్‌కి తెరపై బొమ్మ పడాలని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు.’పుష్ప2’ టీమ్‌ ఎంత కష్టపడుతోందంటే, ఒకటి కాదు, రెండు కాదు, మూడు టీమ్‌ లు ఈ సినిమా కోసం పని చేస్తున్నాయి. పుష్ప ఫైట్‌, సాంగ్‌, ప్యాచ్‌ వర్క్‌ ఒకేసారి చిత్రీకరణ జరుగుతున్నాయి. మూడు చోట్ల, మూడు టీమ్‌లతో ఒకే రోజు షూటింగ్‌ జరిగిన సందర్భాలు ఉన్నాయి.

గత నెల రష్మిక యాగంటిలో చిత్రీకరణ చేస్తే, అదే రోజున రామోజీ ఫిల్మ్‌సిటీలో యాక్షన సీక్వెన్స్‌ జరిగాయి. ఎడిటింగ్‌ వర్క్‌ కూడా మూడు భాగాలుగా మూడు చోట్ల జరుగుతుందని తెలిసింది. మూడు చోట్లా.. సుకుమార్‌ అన్ని వ్యవహారాల్నీ కంట్రోల్‌ చేస్తున్నాడు. పగలు లేదు, రాత్రి లేదు. వర్క్‌ జరుగుతూనే ఉంది. సుకుమార్‌ కేవలం మూడు గంటలపాటే నిద్రపోతున్నారని చిత్ర బృందం చెబుతోంది. జూన్‌ చివరి వారంలో షూటింగ్‌ పూర్తి చేస్తే జులై మొత్తం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసుకోవొచ్చు. ఆగస్టులో ప్రమోషన్లకు తిరిగే ఛాన్స్‌ ఉంది. ’పుష్ప’ చిత్రానికి కూడా ఇలాగే జరిగింది. చివరి నిమిషం వరకూ పనులు జరుగుతున్నాయి. అందుకే ప్రమోషన్లకు పెద్దగా సమయం దొరకలేదు. అయితే ఈసారి అలా జరగకుండా జాగ్రత్త తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు సుక్కూ. అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫవాద్‌ ఫాజిల్‌, సునీల్‌, రావు రమేశ, అనసుయా, సునీల్‌ కీలక పాత్రధారులు. మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.