అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద ఆగకుండా పరుగులు పెడుతోంది. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
నాలుగవ రోజు ఆదివారం పుష్ప 2 హిందీలో రూ.86 కోట్ల నెట్ వసూలు చేసి, ఏకంగా బాలీవుడ్‌లో అత్యధిక సింగిల్ డే కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విడుదలైన తొలి రోజున రూ.72 కోట్లు, రెండవ రోజున రూ.59 కోట్లు, మూడవ రోజున రూ.74 కోట్లు సాధించిన ఈ చిత్రం, నాలుగు రోజుల్లోనే హిందీలో రూ.291 కోట్లు (నెట్) రాబట్టింది.
ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, పుష్ప 2 ఈ వేగంతో త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ఘనతపై స్పందిస్తూ, పుష్ప 2 కేవలం 4 రోజుల్లోనే హిందీలో అత్యంత వేగంగా రూ.291 కోట్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఇది వైల్డ్‌ఫైర్ బ్లాక్‌బస్టర్ అని, ఈ కలెక్షన్లు అభిమానుల ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు.
మొత్తం వసూళ్ల పరంగా, ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్లు గ్రాస్ రాబట్టింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాకు అపారమైన ఆదరణ లభిస్తోంది. మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్ వంటి అంశాలు ఈ చిత్ర విజయానికి కీలకంగా నిలిచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.