ఇప్పుడు ముంబైా హైదరాబాద్ లోని రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెడుతున్న నటవారసురాలు జాన్వీ గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. గడిచిన మూడేళ్లలో జాన్వీ కపూర్ ముంబై జుహూ సహా పలు చోట్ల ఖరీదైన అపార్ట్ మెంట్లను కొనుగోలు చేసింది. దీనికోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. తాజా సమాచారం మేరకు హైదరాబాద్ లో ఖరీదైన ఏరియాలో అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసిందని సమాచారం. దీనికోసం జాన్వీ కపూర్ 3 కోట్ల మేర ఖర్చు చేసిందని తెలిసింది. ప్రస్తుతం జాన్వీ టాలీవుడ్ లో బిజీ అవుతోంది.
ఇప్పటికే ఎన్టీఆర్ సరసన ’దేవర’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రానికి కూడా సంతకం చేసిందని కథనాలొచ్చాయి. ఇకపైనా తెలుగులో అగ్ర హీరోల సరసన నటించాలన్నది జాన్వీ అభిమతం. హిందీ పరిశ్రమతో పాటు తెలుగు పరిశ్రమను జాన్వీ సీరియస్ గా తీసుకుంది. అందుకే హైదరాబాద్ ని తన రెండో ఇల్లుగా మార్చుకోవాలనుకుందిట. ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చిన ప్రతిసారీ ప్రయివేట్ హోటళ్లలో బస చేయడం తనకు నచ్చడం లేదట. షూటింగుల కోసం సుదూర ప్రాంతం నుంచి ప్రయాణాలు చేయడం కూడా అధికప్రయాసతో కూడుకున్నది.
దీంతో ఒత్తిడి పెరుగుతోంది. పైగా హోటల్ లో దిగడం తనకు ఎంతో అసౌకర్యంగా ఉంటోంది. అలాగే ఇది సురక్షితం కాదని కూడా జాన్వీ కపూర్ భావిస్తోందట. అందుకే వెంటనే హైదరాబాద్ లో తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని భావించింది. అనుకున్నదే తడవుగా జాన్వీ ఖరీదైన అపార్ట్ మెంట్ ని సొంతం చేసుకుందని చెబుతున్నారు. జాన్వీ కపూర్ ఒక్కో సినిమాకి 4ా5 కోట్ల మేర పారితోషికాలు అందుకుంటోంది. ఇటీవలే కొన్ని నాయికా ప్రధాన చిత్రాల్లో నటించినందుకు అంతకుమించి పారితోషికం డిమాండ్ చేసిందని కథనాలొచ్చాయి.
తన పారితోషికాలను తెలివిగా పెట్టుబడులుగా మారుస్తోంది. ముఖ్యంగా అపార్ట్ మెంట్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యతనిస్తోందని సమాచారం. జాన్వీ కపూర్ 2020లోనే జుహులో రూ. 39 కోట్ల విలువైన ట్రిప్లెక్స్ అపార్ట్ మెంట్‌ని కొనుగోలు చేసింది.