తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ ఆయన భార్య గాయని సైంధవితో విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడు అయిన జీవీ ప్రకాశ్.. 2013లో తన బాల్య స్నేహితురాలు సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2020లో వారికి ఓ కూతురు కూడా పుట్టింది.
ప్రస్తుతం పలు కారణాల వల్ల ఇద్దరూ విడిపోతున్నారు. ‘చాలా ఆలోచించిన తర్వాత ’సైంధవి.. నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండేందుకు విూడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం.
ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో విూ మద్దతు చాలా అవసరం” అని జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. తమిళంతోపాటు, తెలుగులో కూడా ఎన్నో హిట్ చిత్రాలకు జీవీ సంగీతం అందించారు. యుగానికి ఒక్కడు, రాజా రాణి, అసురన్ , సురరై పోట్రు లాంటి సూపర్ హిట్ చిత్రాలకు పాటలు అందించిన ఆయన తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంటా, ఒంగోలు గిత్త, రాజాధి రాజా, జెండాపై కపిరాజు తదితర చిత్రాలకు సంగీతం అందించారు. హీరోగా 15 చిత్రాల్లో నటించారు.