Gautham Krishna: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో నటుడు నిఖిల్ మలియక్కల్ విన్నర్ గా నిలవగా గౌతమ్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు నిఖిల్ కి సపోర్ట్ గా మాట్లాడగా మరికొందరు గౌతమ్ కి సపోర్ట్ గా మాట్లాడారు. షోలో ఎక్కువమంది కన్నడ నటీనటులను తీసుకోవడంతో వాళ్లంతా కలిసి గ్రూప్ గేమ్ ఆడారని, చివర్లో కూడా నిఖిల్ మా టీవీ నటుడు కాబట్టి అతన్ని గెలిపించారని, తెలుగు వాళ్లకు అన్యాయం చేసారని విమర్శలు వచ్చాయి.
గౌతమ్ కృష్ణ షోలో కొన్నిసార్లు అచ్చ తెలుగు మాట్లాడితే కూడా వేరే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గౌతమ్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో ఈ ట్రోల్స్ పై స్పందించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో గౌతమ్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా ఈ సందర్భంగా గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. నాకు తెలుగు భాష పట్ల గౌరవం ఉంది. నాకు తెలియకుండానే నా మాటల్లో స్ట్రాంగ్ తెలుగు పదాలు వచ్చేస్తాయి. అలాంటి పదాలు వాడినప్పుడు మన తెలుగు మనం మాట్లాడొద్దు అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. నాకు భాషా ప్రావీణ్యం ఉంది కాబట్టి నేను మాట్లాడాను.
ఒక తెలుగు వ్యక్తి అయి ఉండి తెలుగు ఎందుకు స్పష్టంగా మాట్లాడుతున్నావు అని ప్రశ్నించడం చాలా పెద్ద తప్పు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ భాష కాకుండా వేరే భాషలు మాట్లాడితే ఒప్పుకోరు. మన తెలుగు సినిమాలు, తెలుగు ఆర్టిస్టులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మన భాషని గౌరవించాలి. దాంట్లో తప్పులేదు. కొంతమంది కావాలని చేసి ఉంటారు ఈ ట్రోల్స్. కానీ రెగ్యులర్ తెలుగు వాళ్ళు మాత్రం ఈ ట్రోల్స్ చేసి ఉండరు అని తెలిపారు గౌతమ్ కృష్ణ. అనంతరం యాంకర్ అలాగే కావాలని కొంతమంది తెలుగు, కన్నడ అని సపరేట్ చేసి మిమ్మల్ని చూశారా అని ప్రశ్నించగా.. నన్ను అలా చూసి ఉండరు. కొంతమంది కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఏమైనా అలా చూసి ఉండొచ్చేమో. ఒకవేళ తెలుగు, కన్నడ చూడాల్సి వస్తే నాతో పాటు హౌస్ లో చాలా మంది తెలుగు కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు కదా అని తెలిపారు. ఈ మేరకు గౌతమ్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.