అవును – అనే సమాధానమే వస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24 తేదీ భారత దేశ పర్యటనకు వస్తున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మూడు గంటలు పర్యటిస్తారు. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలసి వంద కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు వస్తున్నారంటే వంద కోట్ల రూపాయల వ్యయం చేయడం పెద్ద సమస్య కాదు.అయితే ఈ సందర్భంలో అమెరికా భారత దేశాల మధ్య కుదరనున్న ఒక ఒప్పందమే భారత దేశ పౌల్ట్రీ పరిశ్రమ కొంప ముంచుతుందని భావిస్తున్నారు. అమెరికా నుండి చీకెన్ లెగ్స్ పీసులు దిగుమతికి రాచబాట వేయనున్నారు.
అమెరికన్లు కోడి మధ్య భాగం మాత్రమే తింటారట. లెగ్ పీసులు తినేందుకు ఇష్ట పడరని అవి విదేశాలకు ఎగుమతిలో భాగంగా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరనున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే భారత దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ అటకెక్కవలసినదే. అమెరికా నుండి దిగుమతి చేసుకొనే చికెన్ లెగ్ పీసులు చౌకగా లభ్యం అయ్యాయంటే ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ ఎంతవరకు నిలదొక్కుకుంటుందో భవిష్యత్తులో తెలుస్తుంది. ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో రైతుల వరకు పడుతుంది.
ఇలాంటి అనుభవాలు గతంలో చాల వున్నాయి. తొంబయి దశకంలో భారత దేశంలో నిరుపేద పిల్లలకు పౌష్టికాహారం పేర యునిసెఫ్ నుంచి పెద్ద ఎత్తున పాల పొడి దిగుమతి అయింది. ఆపాటికే భారత దేశంలో పాల వెల్లువ పితామహుడుగా పేరు పొందిన నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు రథసారధి కురియన్ ఈ పాల పొడిని పాలుగానూ పొడిగానూ అమ్మి ఆ డబ్బుతో దేశంలో డెయిరీ పరిశ్రమ అభివృద్ధి చేయాలని ఉపక్రమించారు. యునిసెఫ్ నుండి వచ్చిన పాల పొడి కిలో దాదాపు 27 రూపాయలు రేటుకు అమ్మకాలు జరిగితే దేశంలోని డెయిరీల్లో ఉత్పత్తి అయ్యే పాలపొడి దాదాపు 34 రూపాయలకు అమ్మవలసి వచ్చింది. పోటీలో నిలవలేని పలు డెయిరీలు నష్టాల బారిన పడి క్రమేణా మూత పడ్డాయి. ఈ లోపు సరళీ కృత ఆర్థిక విధానాలు అమలులోకి రావడంతో ప్రైవేటు డెయిరీలకు ద్వారాలు తెరవ బడ్డాయి. ఫలితంగా సహకార రంగంలోని డెయిరీలకు కాలం చెల్లింది. ఇలాంటి అనుభవం కళ్ల ముందున్నా అమెరికా నుండి చికెన్ లెగ్ పీసులు దిగుబడికి సిద్ధమౌతున్నారంటే దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ గొంతు నులమడమే.