దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆలయంలో అవమానం జరిగినట్లు తెలుస్తుంది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న ఆండాళ్ దేవాలయంలో గర్భగుడికి వెళ్లిన ఇళయరాజాను అక్కడున్న పూజారులు బయటకు పంపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిసెంబర్ 16 నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుండటంతో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలోని అండాళ్, రంగమన్నార్‌లన్ దర్శించుకునేందుకు ఇళయరాజా ఆలయానికి చేరుకున్నాడు.
ఆలయంలోకి వెళ్లిన అనంతరం ఇళయరాజాతో పాటు చిన్నజీయర్ కూడా అతడి వెంట ఉన్నాడు. అయితే స్వామివారి దర్శనం కోసం గర్భగుడి ముందు ఉన్న అర్థ మండపంలోకి రాజా ప్రవేశించడానికి ప్రయత్నించగా.. అక్కడ ఉన్న పూజారులతో పాటు చిన్న జీయర్ కూడా బయటనే ఉండమని చెప్పారు. దీంతో అర్థ మండపం మెట్ల దగ్గర నిలబడి ఇళయరాజా ఆలయ మర్యాదలను స్వీకరించడంతో పాటు స్వామివారిని దర్శించుకున్నాడు.
అయితే గర్భగుడిలోకి ఇళయరాజాను రానివ్వక పోవడం కలకలం రేపింది. ఈ విషయంపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో పాటల్లో స్వామిని కీర్తించిన సంగీత విద్వాంసుడికి దక్కిన గౌరవం ఇదేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.