టాలీవుడ్ పరిశ్రమకు 2024 సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాలను తెచ్చింది. ముఖ్యంగా ఈ ఏడాది రెండు చిత్రాలు 1000 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్ సత్తాను మరోసారి నిరూపించాయి. ఈ విజయాలతో తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయాన్ని సాధించాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, 13 రోజుల్లోనే 1375 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి, ఈ ఏడాది టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల ఆదరణ సినిమాను ఎన్నో రికార్డులను సృష్టించేలా చేసింది.
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడీతో 1000 కోట్ల క్లబ్‌లోకి మరోసారి చేరాడు. ఈ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ప్రభాస్ తర్వాత, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1తో 420 కోట్ల గ్రాస్ వసూళ్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఎన్టీఆర్ సింగిల్ హ్యాండెడ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు విశేష ఆదరణను తీసుకువచ్చింది.
మరోవైపు, తేజా సజ్జా హనుమాన్ సినిమాతో 296 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి టాప్ 4లో నిలిచాడు. మహేష్ బాబు గుంటూరు కారంతో 175 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా, సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్తో 125 కోట్ల కలెక్షన్లతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది టాలీవుడ్ పరిశ్రమలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన విభిన్న చిత్రాలు విడుదలై విజయాలను సాధించాయి.