అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం వెనుక టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఎన్నికల కోసం మస్క్ చేసిన ఆర్థిక సహాయం, ట్రంప్ పట్ల చూపిన మద్దతు ఆయన రాజకీయ ప్రాధాన్యతను మరోస్థాయికి చేర్చింది. ఫెడరల్ ఫైలింగ్ ప్రకారం, మస్క్ ట్రంప్ ప్రచారానికి మద్దతుగా సుమారు 270 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు.
ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2 వేల కోట్లు. ఈ విరాళంలో మెజార్టీ భాగం పొలిటికల్ యాక్షన్ కమిటీ (PAC)కు కేటాయించగా, మిగతా మొత్తం RBG PACకి అందజేశారు. మస్క్ చేసిన ఈ భారీ విరాళం, గతంలో టిమ్ మెల్లన్ 200 మిలియన్ డాలర్ల ఖర్చు చేసిన రికార్డును అధిగమించింది.
ప్రచార ర్యాలీలలో స్వయంగా పాల్గొని మస్క్ తన మద్దతును వ్యక్తీకరించారు. ట్రంప్ విజయం సాధించేందుకు మస్క్ వినియోగించిన వ్యూహాలు రిపబ్లికన్ పార్టీకి చాలా ఉపయోగకరంగా మారాయి. ఈ మద్దతు నేపథ్యంతో ట్రంప్, మస్క్‌కు తన కేబినెట్‌లో కీలక బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నారు.
గెలుపు తర్వాత, మస్క్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) బాధ్యతలు స్వీకరించారు. ఈ శాఖ ప్రభుత్వ విధానాలను సమర్థంగా అమలు చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. మస్క్ అందించిన ఈ మద్దతు, ఆయనకు రాజకీయాలలో ఒక కొత్త అడుగు వేయడానికి అవకాశాలు కల్పించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.