టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 10న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం, ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాజకీయ డ్రామాగా ఇప్పటికే అంచనాలను పెంచింది. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా, తన ట్రైలర్, పాటలతో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రానికి తమిళనాడు మధురై నియోజకవర్గ ఎంపీ ఎస్ వెంకటేషన్ రచయితగా పనిచేసినట్లు సమాచారం. రాజకీయ నాయకుడిగానే కాకుండా, ప్రముఖ రచయితగా పేరున్న వెంకటేషన్, తన నవల వీర యుగ నాయకన్ ద్వారా శంకర్ దృష్టిని ఆకర్షించారు. ఆ నవల హక్కులను శంకర్ కొనుగోలు చేసిన అనంతరం, ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ విషయంలో ఆయన పాత్ర కీలకంగా మారింది.
చరణ్ ఐఏఎస్ పాత్రకు వెంకటేషన్ ప్రత్యేకంగా సహకరించారని, పాత్రను లోతుగా డిజైన్ చేయడంలో తన విశేషాలను అందించారని తెలిసింది. సినిమాకు అవసరమైన రాజకీయ నేపథ్యాన్ని, సంభాషణల నైపుణ్యాన్ని ఆయన అందించారని సమాచారం. సెట్స్‌కు తరచూ హాజరైన వెంకటేషన్, తన సూచనల ద్వారా శంకర్ విజన్‌కు విలువైన మద్దతుగా నిలిచారు. మూడేళ్ల కృషితో రూపొందిన గేమ్ ఛేంజర్, రాజకీయ నేపథ్యంలో చరణ్ పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చేలా ఉందని టాక్. ఎస్ వెంకటేష్ రైటింగ్ టచ్ ఈ సినిమాలో ఎలా ప్రభావితం చేస్తుందనేది సినిమా రిలీజ్ తరువాత తెలుస్తుంది.