రాజకీయాల్లో స్టిక్కర్ల గోల ఎక్కువైపోయింది. అక్కడికేదో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే పొలిటికల్ స్టిక్కర్లు తొలిసారిగా తెరపైకొచ్చినట్లుగా హంగామా నడుస్తోంది. ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ అంటూ వైసీపీ అంటిస్తోన్న స్టిక్కర్లను జనం పీకి పారేస్తున్నారు. అందరూ అని కాదుగానీ, మెజార్టీ ప్రజానీకం స్టిక్కర్లను తమ ఇళ్ళ నుంచి పీకి పారేస్తున్న వైనం కనిపిస్తోంది.
ఇందులో వింతేముంది.? తమ ఇళ్ళకు ఇంకొకరి స్టిక్కర్లు వుండడాన్ని ఎవరూ ఇష్టపడరు. గతంలో చంద్రబాబు పాలనలోనూ ఇలాంటి స్టిక్కర్లు అంటించడం చూశాం. అప్పుడూ పీకి పారేశారు. అప్పట్లో ఆ స్టిక్కర్లు టీడీపీ అను‘కుల’ మీడియాకి ఇష్టంగా అనిపించాయ్. జనం పీకేయడాన్ని టీడీపీ అనుకూల మీడియా పట్టించుకోలేదు.
తామే కొత్తగా స్టిక్కర్ల కాన్సెప్ట్ తెరపైకి తెచ్చినట్లు వైసీపీలో కొందరు చేస్తున్న ప్రచారం కూడా సరి కాదు. చంద్రబాబు హయాంలో అయితే, అప్పడాల మీద కూడా చంద్రబాబు ఫొటోలేయించేశారు టీడీపీ నేతలు. అలా వుండేది పబ్లిసిటీ పైత్యం అప్పట్లో. దానికి ఏమాత్రం తగ్గకుండా వైసీపీ హయాంలోనూ ఈ పబ్లిసిటీ పిచ్చి కొనసాగుతోందంతే.
స్టిక్కర్లు అంటించడమెందుకు.? పీకి పారెయ్యడమెందుకు.? అన్న ప్రశ్న దగ్గరకి వస్తే, ‘స్టిక్కర్ వుంచితే సరే సరి.. పీకేస్తే, సంక్షేమ పథకాలుండవ్..’ అని వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రజల్ని హెచ్చరిస్తున్న వైనం కూడా కనిపిస్తోంది. ‘స్టిక్కర్లకీ సంక్షేమ పథకాలకీ లింకేంటి.?’ అంటూ జనం వైసీపీ మీద మరింత అసహనం పెంచుకుంటున్నారు.
వైసీపీ అనుకూల మీడియా అంటే, వైసీపీకి కాస్తో కూస్తో మేలు చేసేలా వ్యవహరించాలి. వాస్తవాల్ని అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్ళడంలో అధికార పార్టీ అనుకూల మీడియా విఫలమవుతూ వస్తోంది. ఈ తరహా కాన్సెప్టుల కోసమే సలహాదారుల్ని నియమించుకున్నారా.? అన్న డౌటానుమానాలు రావడంలో వింతేముంది.?