బిగ్ బ్రేకింగ్: ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన జగన్‌… కీలక సూచనలు!

నీతి ఆయోగ్ మీటింగ్, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి జగన్ హస్తినకు వెళ్లిన నేపథ్యంలో “ముందస్తు” కథనాలు ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేశాయి. అక్టోబర్ లో జగన్ అసెంబ్లీని రద్దు చేసి, డిశెంబర్ లో ఎన్నికలకు వెళ్లబోతున్నారంటూ గాసిప్పులు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ విషయాలపై జగన్ స్పష్టత ఇచ్చారు.

ఏపీలో గతకొన్ని రోజులుగా ముందస్తు కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. ముందస్తు అనే ఉద్దేశ్యమే తనకు లేదని సీఎం జగన్ తమతో ఎన్నోసార్లు చెప్పారని.. ఏపీ మంత్రులు చెబుతున్నా… ఒకవర్గం మీడియాతో పాటు విపక్షాలు సైతం… ముందస్తుపై తెగ వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలు ఉంటే… జూన్ లోనే ప్రజలోకి వస్తానని గతంలో ప్రకటించిన పవన్ కూడా… వారాహి యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సమయంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును… తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. కేబినెట్‌ ముగిసిన అనంతరం మంత్రులతో మాట్లాడిన ఆయన.. ముందస్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్ తేల్చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే తనకు లేదని, ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం మిగిలి ఉందని తేల్చి చెప్పేశారు. ఇదే క్రమంలో… ఈ 9 నెలలు కష్టపడితే గెలుపు మనదేనని, ఆ విషయం నేతలంతా గుర్తుంచుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు.

కాగా, కొన్ని రోజుల క్రితం ఏపీ మంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా ముందస్తుపై స్పందించిన సంగతి తెలిసిందే. ప్రజాతీర్పుకు తాము లోబడి ఉంటామని, ప్రజలు తమకు ఇచ్చిన ఐదేళ్లూ పరిపాలిస్తామని, తమకు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం పట్టలేదని స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే… ముందస్తుపై స్పష్టత ఇవ్వడంతో… ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలు కాస్త కూల్ అయ్యే ఛాన్స్ ఉందేమో వేచి చూడాలి!