తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ మూవీల ట్రెండ్ నడుస్తోంది. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో వచ్చిన ‘యాత్ర’ ఒకటి. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవడంతో దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ‘యాత్ర 2’ని చేశారు. ఇది ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టోరీతో రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. స్వర్గీయ వైఎస్సార్ బయోపిక్ గా దర్శకుడు మహి.వి. రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ‘యాత్ర’ చిత్రానికి సీక్వెల్ గా ‘యాత్ర 2′ తెరకెక్కింది.’యాత్ర’ సినిమా వైఎస్సార్ బయోపిక్ గా రాగా ‘యాత్ర 2’ జగన్ బయోపిక్ గా వచ్చింది. నేడు (8 జనవరి 2024) ఈ యాత్ర 2 సినిమా ప్రేక్షకులముందుకొచ్చింది. థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాని మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మించారు. మలయాళ స్టార్ మమ్ముట్టి, జీవా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమే ‘యాత్ర 2’. క్రియేటివ్ డైరెక్టర్ మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఇందులో రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకుందాం…
కథ : వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఏ పరిస్థితుల్లో పాదయాత్రను ప్రారంభించారు? చివరి ప్రజల మద్దతును కూడగట్టుకుని ఎలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అన్న అంశాలతో తెరకెక్కించిన చిత్రమే ‘యాత్ర 2’. దీంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ మనందరికీ తెలిసిందే. వైఎస్సార్(మమ్ముట్టి) తన కొడుకు జగన్(జీవా)ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నాను అని ప్రజలకు పరిచయం చేస్తూ కథ ప్రారంభమవుతుంది. తర్వాత ఏపీలో విజయం సాధించడం, వైఎస్సార్ సీఎం అవ్వడం చూపిస్తారు. అనంతరం వైఎస్సార్ మరణం, జగన్ ఓదార్పు యాత్ర, హైకమాండ్ ఓదార్పు యాత్రని ఆపేయమనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టడం పెట్టడం, బై ఎలక్షన్స్ లో గెలవడం, జగన్ పై సిబిఐ దాడులు, జగన్ అరెస్ట్ వంటి అంశాలు చూపిస్తారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని విభజించడం, చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) సీఎం అవ్వడం, మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం, పాదయాత్ర చేయడంలాంటివన్నీ చూపిస్తారు. చివర్లో 2019 లో జగన్ సీఎం అవ్వడంతో సినిమాని ముగించారు.
విశ్లేషణ.. అందరికీ తెలిసిన కథే కావడంతో కథనంపై దర్శకుడు చాలా శ్రద్ధ పెట్టాడు. ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా అయినా తండ్రి కోసం, ఇచ్చిన మాట కోసం నిలబడే కొడుకు కథగా ఎమోషనల్ గా రన్ చేసారు. 2009 – 2019 మధ్యకాలంలో జరిగిన రాజకీయాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలని తీసుకొని సినిమా ఆద్యంతం ఆసక్తిగా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించిన సన్నివేశాలు ఆసక్తి గొలుపుతాయి. సినిమాలో జగన్, వైఎస్సార్, చంద్రబాబు.. అంటూ క్యారెక్టర్స్ కి అన్ని ఒరిజినల్ పేర్లే వాడటం గమనార్హం. పార్టీల పేర్లు మాత్రం మార్చారు. సినిమాని ఓ పక్క ఎమోషనల్ గా రన్ చేస్తూనే మరో పక్క జగన్ పాత్రకి ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. కాకపోతే తెలిసిన కథ కావడం, ఎక్కువ ఎమోషనల్ గా రన్ చేయడంతో కొన్ని చోట్ల మాత్రం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక వైఎస్సార్ మరణం అప్పుడు రియల్ విజువల్స్, చివర్లో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేయడం కూడా రియల్ విజువల్స్ చూపించడం గమనార్హం. అయితే తెలిసిన కథనే ఏ రేంజ్ లో ఎమోషనల్ గా నడిపించాడు అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటుల విషయానికొస్తే.. నటుడిగా జీవా మాత్రం తన 100 శాతం బెస్ట్ ఇచ్చాడనే చెప్పొచ్చు. గతంలో యాత్ర సినిమాలో మమ్ముట్టి ఎంతగా ఒదిగిపోయారో, ఈ సారి వైఎస్ జగన్ పాత్రలో జీవా కూడా అంతే ఒదిగిపోయాడు. మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో సినిమా మొదట్లో పది నిముషాలు కనిపించి మెప్పిస్తారు. ఇక వైఎస్సార్ భార్య విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి అదరగొట్టారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని చెప్పొచ్చు. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్..తదితర నటీనటులు ఆకట్టుకున్నారు.
సాంకేతిక విలువలు: పొలిటికల్ బ్యాగ్డ్రాప్లో వచ్చిన ‘యాత్ర 2’ ‘మహి వీ రాఘవ్ నుంచి మరో అద్భుతం. మమ్ముట్టి, జీవా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాలో డైలాగులు పెద్ద బలంగా కనిపించాయి. సంతోష్ అందించిన మ్యూజిక్ బాగుంది. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం ఎపిసోడ్‌తో సినిమా హై రేంజ్లో ఎండ్ అవుతుంది. ‘యాత్ర’ సినిమాతో అందర్నీ మెప్పించిన మహి రాఘవ్ ఇప్పుడు ‘యాత్ర 2’ పొలిటికల్ బయోపిక్ అయినా ఎక్కువగా ఎమోషనల్ గా కథనం నడిపించి, దర్శకుడిగా కూడా మరోసారి సక్సెస్ అయ్యాడు. దర్శకుడు మహి వి రాఘవ్ సినిమాలకు మంచి పేరే ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో బీజీఎమ్, జగన్ పాత్రకి ఎలివేషన్స్ లో ఇచ్చిన బీజీఎమ్ హైలెట్ గా అనిపిస్తుంది. మొత్తం మీద ‘యాత్ర 2’ సినిమా కూడా ‘యాత్ర’ లాగే పొలిటికల్ బయోపిక్ అయినా ఎమోషనల్ గా రన్ చేసి ప్రేక్షకులని మెప్పించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. గత ఎన్నికల ముందు యాత్ర సినిమా వచ్చి ఎలా మెప్పించిందో ఇప్పుడు యాత్ర 2 కూడా అదేవిధంగా ప్రేక్షకులని మెప్పిస్తుంది