(సలీమ్ బాష*)
నాలుగైదు దశాబ్దాల క్రితం వినాయకచవితి వచ్చిందంటే మాకు భలే సరదాగా ఉండేది. బీ.క్యాంపు కాలనీలో ఎవరింట్లో వాళ్ళు మట్టితో చక్కగా వినాయకుడ్ని తయారుచేసుకుని.. ఇంట్లోనే పూజించేవాళ్ళు. (కొంత కాలం తర్వాత నర్సిమ్ములు బంకులో రంగు రంగుల విగ్రహాలు పెట్టినట్లు గుర్తు)తర్వాత మా కేసీ కెనాల్లో నిమజ్జనం ఉండేది. కొంతమది తుంగభద్రలో మరికొందరు హంద్రీ లో వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళు. అసలు చవితి వచ్చిందంటే వాళ్ళూ, వీళ్ళూ అనకుండా ప్రతి ఒక్కరు సరదాగా పండగలో భాగమయ్యేవారు.
మరో విశేషమేమిటంటే నేనూ, నాతో పాటు ఖాదర్, మునాఫ్, రమణ బంకమట్టి తెచ్చి వినాయకుడిని చేయ్యటం, అబ్రహం, దేవిడ్ సుధాకర్, సాలమన్ లు వాటికి రంగులెయ్యటం. రంగులంటే పసుపు సున్నం కలిపి పూయటం అంతే! వాటిని వాడేది మాత్రం సుబ్రమణ్యం, వేణు గోపాల్, రాఘవేంద్ర, శర్మలు!! అదీ అప్పటి వినాయకచవితి అంటే. మా విజ్ఞాన మందిరం లో కూడా చిన్న విగ్రహమే ఉండేది.. కాశిభట్ల వేణుగోపాల్ వళ్ళ నాన్నగారు పూజారి. మేమంతా రోజు గుడికెళ్ళి చక్కెర (అప్పుడప్పుడు కేసరి) పొంగలి తిని, కొబ్బరి చిప్పలు తెచ్చుకుని పగలగొట్టి తినేవాళ్ళం. ఆ వారం రోజులు అన్ని ఇళ్ళకీ వెళ్ళి అన్ని విగ్రహాలు చూసి ఏవరింట్లో గణపతి (మహా అయితే ఒక్క అడుగు) బావున్నాడో జడ్జ్ చేసే వాళ్ళం!
నిమజ్జనానికి అందరం వెళ్ళేవాళ్ళం. పండగప్పుడు ఒక్క గుళ్ళో మాత్రం మైకు లో భక్తి పాటలు వచ్చేవి. మా మనోరమ టీచర్ భర్త సుబ్రమణ్యం దానికి ఇంచార్జ్! శుక్లాబరధరం శ్లోకం రోజు వచ్చేది ఆ మైకులోనే. అది విని అందరం ఆ శ్లోకం నేర్చేసుకున్నాం! నాకు ఇప్పటికి అది గుర్తుంది. అప్పుడు సాయబులు లేదా తుర్కోళ్ళు, కిరస్తానీయులు(అలాగే అనేవారు. ఎవరం ఫీలయ్యే వాళ్ళం కాదు) చాలమందికి అది బాగా వచ్చు. ఇప్పుడు ఎంతమంది పిల్లలకి అది కంఠతా వస్తుందో!.
ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే పెద్ద పెద్ద విగ్రహాలు, వారం రోజులపాటు హోరెత్తించే సినిమా పాటలు ఆనక పటాసుల మోతతో రాత్రంతా నిమజ్జన కార్యక్రమం, కొన్ని లక్షల రూపాయల ఖర్చు అదనంగా వాతావరణ కాలుష్యం…..
అప్పుడు పండగ అందరిది.ఇప్పుడు కొందరిదే! అప్పుడు పెద్దగా ఖర్చయ్యేది కాదు. ఇప్పుడు చాలా ఖర్చు, అంతే తేడా! ఇప్పుడు వినాయకుడూ పెద్దగయ్యాడు.. మనుషులే ఇంకా పెద్దవాళ్ళు కాలేదు.
(*సలీం బాష జర్నలిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు కర్నూల్)