తెలుగు రాష్ట్రాల్లో కమ్యునిస్టులు ఏమైపోయారు? ఇప్పటికీ తెలంగాణలో అప్పుడప్పుడూ నక్సలైట్లు లేఖలు విడుదల చేసి తమ ఉనికిని చాటుకుంటుంటే… జనజీవన స్రవంతిలో ఉన్న కమ్యునిస్టులు ఏమైపోయారు? కమ్యునిస్టు పార్టీ అంటే అది ఒక రాజకీయ స్థావరంగా మాత్రమే చూస్తున్న ఈ తరం కమ్యునిస్టులు ఇప్పుడెక్కడున్నారు? ఏపీలో అయితే పసుపు రంగు పులుముకోవడంలో కమ్యునిస్టులు బిజీగా ఉన్నారు. ఆఖరికి ఆ పార్టీని “కమ్మ”నిస్టు పార్టీగా మార్చేశారనే స్థాయి విమర్శలు వస్తున్నా కూడా… వారు ఆ ప్రయత్నాలు మానడం లేదు, మార్చుకోవడం లేదు! మరి ఎంతో ప్రోత్సాహం, ఆదరణ ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కమ్యునిస్టులు ఏమైపోయారు? ఆ పార్టీల అభిమానులు, వారి పోరాటాలపై ఇంకా నమ్మకం ఉన్న ప్రజలు ఈ ప్రశ్నలు వేస్తున్నారు.
అవును… కమ్యూనిస్టులంటే ప్రజల నాయకులు, పేదల ఆశాజ్యోతులు! వారికి ఏకష్టమొచ్చినా ముందువరుసలో నిలబడే ఎర్ర జెండా యోధులు!! విచిత్రం ఏమిటంటే… ఇది గతం – చరిత్రలో కలిసిపోయిన ఒక అధ్యాయం!! కారణం… కమ్యునిస్టులు కూడా కమర్షియల్ పొలిటీషియన్స్ అయిపోయారనే కామెంట్లు! ఏపీలో ఒకప్పుడు పేదలకోసం ప్రభుత్వ భూముల్లో ఎర్ర జెండాలు పాతిన చరిత్ర కమ్యునిస్టుల సొంతం. ఇప్పుడు విచిత్రంగా ప్రభుత్వమే పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే… తలుపు సంధుల్లోనుంచి ఒక ఎర్ర జెండా నేత చూస్తుంటే… దానిలో కోడిగుడ్డుపై ఈకలు పీకే పని మరొక ఎర్రజెండా నేత చేస్తున్నారు!
ఒకప్పుడు రైతులకు మొదటి స్నేహితులుగా కమ్యునిస్టులు ఉండేవారు. ఎర్ర జెండాలకు ఒక కన్ను కార్మికులు అయితే… మరోకన్ను రైతులుగా ఉండేవారు. అయితే… తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలుగా దాదాపు 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. నేడు ఆ కమ్యునిస్టులు ఏమైపోయారు? ఒకప్పటికి కమ్యునిస్టుల మనుగడకు వేదిక అయిన ధర్నా చౌక్ ను నిర్బంధ అణచివేత విధానాలతో మూసివేస్తే… కిమ్మనకుండా ఉన్న కమ్యునిస్టులూ.. మీరేమైపోయారు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలైనటువంటి… 57 సంవత్సరాల పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, నిరుద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు కొత్త సమస్యగా తెరపైకి వచ్చిన టీఎస్పీఎస్సీ లీకేజీ అంశంపైనా… వామపక్షాలు ఏనాడు నోరు మెదపలేదు ఎందుకు? గత తొమ్మిది ఏళ్లలో కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయల రాయితీలు, రద్దులు ప్రకటించి, సామాన్య ప్రజలకు మాత్రం ఉచిత దొడ్డు బియ్యంతో సరిపెట్టడంపై ఎర్రన్నలు ఏనాడూ ఎందుకు మాట్లాడటం లేదు.. వారిస్థాయిలో ఎందుకు పోరాడటం లేదు?
ప్రస్తుతం ఏపీలో కమ్యునిస్టులకు పెద్దగా పనిలేకపోయినా… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత తొమ్మిదేళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు కమ్యునిస్టులకు ఎందుకు కనిపించడం లేదు? పేదల కోసం పనిచేస్తున్న జగన్ ని ఓడించడానికి ఆరు నూరైనా చంద్రబాబు – పవన్ లతో కలిసి ప్రయాణిస్తామనే స్థితికి… బీజేపీని కొట్టడానికి బీఆరెస్స్ తో కలిసి ప్రయాణిస్తామని చెప్పే పరిస్థితికి కమ్యునిస్టులు ఎందుకు దిగజారిపోతున్నారు! నేటి కమ్యునిశ్టులు చేస్తున్న అనైతిక రాజకీయాలకు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు… ఎర్ర జెండా కన్నీరు పెడుతుంది!!
ఇప్పటికీ పోయిందేమీ లేదు… కమ్యునిస్టులంటే ఎవరు అని అడిగితే… పాత పుస్తకాలు తిరగేసే పరిస్థితి, ఆన్ లైన్ లో సెర్చ్ చేసే పరిస్థితి రేపటి తరానికి కల్పించొద్దు. ఎన్నో కోట్ల మంది కలలుగన్న స్థాపనలు అవసరం లేదు… లక్షల మంది త్యాగాలు గాలికివదలకుండా ఉంటే చాలు. ప్రజల మనసుల్లో కనీసం ఉనికిని ప్రశ్నార్ధకం చేసుకోకుండా నడుచుకుంటే మేలు! పేదోడికి ఉన్న ఆ ఒక్క నమ్మకాన్ని దూరం చేయొద్దు!… ఎర్ర జెండాను ఇంకా ఏడిపించొద్దు!