జూలై 4 న రంగా జయంత్రి. దీంతో ఈ రోజున ఏపీలో పలు చోట్ల కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా టీడీపీ జనసేనతో పాటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున రంగా జయంతిని ఎక్కడికక్కడ నిర్వహిస్తోంది.. ఇదే సమయంలో బీజేపీ కూడా రంగాను తలచుకుంటోంది. ఆ సంగతి అలా ఉంటే… రంగా జయంతి సందర్భంగా పవన్ కు ఒక రిక్వస్ట్ చేస్తున్నారు జనసైనికులు.
అవును… రంగా జయంతి సందర్భంగా అన్ని రాజకీయపార్టీలూ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా… వైసీపీ నాయకత్వంలో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రంగా జయంతి వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ పరంగా చేసే కార్యక్రమాలు ఇంకా తెరపైకి రాలేదు. టీడీపీ సమాచారం ఇంకా బయట పడలేదు.
అయితే ఎన్నికు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయపార్టీలూ ఈ మేరకు రంగా జయంతి కార్యక్రమాలు చేస్తాయనేది తెలిసిన విషయమే. ఆ సంగతి అలా ఉంటే… ఈసారి ఎన్నికల్లో కాపులు నిర్ణయాత్మకమైన భూమికను పోషించనున్నారని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఇది గ్రహించే పవన్ ఆ స్థాయిలో మాట్లాడుతున్నారని అంటున్నారు.
అయితే ఈ సందర్భంగా రంగా కోరికలు, రంగా ఆశయాలు, రంగా లక్ష్యాలు నెరవేర్చడానికి పవన్ కు ఒక అవకాశం ఉందనేది బలంగా వినిపిస్తున్న మాట. జనసేన ఒంటరిగా పోటీచేసి ఆ లక్ష్యాలను సాధించాలనేది మరో అభిప్రాయం. కారణం… రాష్ట్రంలో సుమారు 50 నుంచి 60 నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గ ఓట్లు గెలుపోటములను ప్రభావింతం చేయగలుగుతాయనడంలో సందేహం లేదు.
ఇందులో మెజారిటీ స్థానాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈ విషయంలో జంకుతున్న పవన్ కల్యాణ్… తన శ్రద్ధ మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే పెట్టారని తెలుస్తుంది. అలా అని 34 నియోజకవర్గాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని కూడా చెప్పలేని పరిస్థితి. 34 నియోజకవర్గాల్లోనూ వైసీపీని ఓడించమని అడుగుతున్న పవన్ కల్యాణ్… ఆ 34 నియోజకవర్గాల్లోనూ జనసేనను గెలిపించండి అని చెప్పే సాహసం చేయలేకపోతున్నారు.
ఈ నాలుక మడత మాటలే ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పలువురు జనసైనికులు వాపోతుంటారు. అలా కాకుండా ఉమ్మడి గోదావరి జిల్లాలోని 34 స్థానాల్లోనూ జనసేనను గెలిపించండి అని చెప్పడంతోపాటు… ఉత్తరాంధ్రలో కూడా మరో 20 స్థనాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాలో మరో కొన్ని స్థానాల్లో పవన్ పోటీ చేయగలిగితే కచ్చితంగా ప్రయోజనం ఉంటుందనేది పలువురి అభిప్రాయంగా ఉంది.
అలా చేస్తేనే రంగా ఆశయాలు నెరవేర్చిన వారవుతారనేది బలంగా వినిపిస్తున్న మాటగా ఉంది. అలాకానిపక్షంలో చంద్రబాబు పాదాలవద్ద రంగా ఆశయాలను ఉంచినవారవుతారనే కామెంట్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీంతో… పొత్తులంటూ టీడీపీ అనుకూల రాజకీయాలు చేస్తున్న పవన్ కు రంగా జయంతి సాక్షిగా కాపులు తమ మనసులో మాటను మరో మారు చెప్పి దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు.
కాగా.. 1988 డిసెంబర్ 26న టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రంగా హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనక చంద్రబాబు హస్తం ఉందనేది వైసీపీ నాయ్కుల ఆరోపణ కాగా.. మరికొందమంది కాపు సామాజికవర్గ ప్రజల నమ్మకం కూడా!!