షాకింగ్… ఏపీలో “ఆరోగ్య శ్రీ” కి కూటమి సర్కార్ మంగళం!?

ఏపీలో ప్రజానికం ఎన్నో ఆశలు పెట్టుకుని, రెట్టింపు సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలకు ఆశపడి ‘టీడీపీ – జనసేన – బీజేపీ’ కూటమి పార్టీలను గెలిపించిన సంగతి తెలిసిందే! ప్రధానంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇచ్చిన హామీలకు ప్రజలు ఆకర్షితులయ్యారని అంటారు. కూటమికి దక్కిన ఈ గెలుపులో జగన్ పై వ్యతిరేకత కంటే ఉచిత హామీలే కీలక భూమిక పోషించాయని చెబుతారు.

అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల అమలుపై నీలినీడలు కమ్ముకున్న పరిస్థితి. ఇప్పటికే పిల్లలను స్కూళ్లకు పంపుతున్న తల్లులు ఎంతో ఆశగా ఎదురుచూసిన “తల్లికి వందనం” పథకానికి.. జగన్ చెప్పినట్లు శఠగోపం పెట్టేసిన పరిస్థితి. ఇక సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం.. కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఆందోళనగా ఉందంటూ బాబు ఫెర్మార్మెన్స్ స్టార్ట్ చేశారు!

దీంతో… తల్లికి వందనంతో పాటు నెలకు రూ.3,000 నిరుద్యోగభృతి, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.20,000 వంటి హామీల అమలూ కష్టమే అనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఏకంగా “ఆరోగ్య శ్రీ” పథకానికీ మంగళం పాడేసినట్లు చెబుతున్నారు. టీడీపీకి చెందిన కేంద్రమంత్రి మాటలు ఇలానే ఉన్నాయని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… టీడీపీ ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది! ఈ వీడియోలో… కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న “ఆయుష్మాన్ భారత్” కార్డును ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన అందరూ తీసుకునేలా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు!

తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న గుంటూరు లోక్ సభ పరిధిలో ఈ “ఆయుష్మాన్ భారత్” కార్డులు పొందడానికి సుమారు మూడు లక్షల కుటుంబాలకు అర్హత ఉండగా.. కేవలం 28,000 కార్డులే ఇప్పటివరకూ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ ప్రజలంతా ఈ కార్డులు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రతీ ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకొవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్డుల ద్వారా ఐదు లక్షల వరకూ ఉచిత వైద్య సౌకర్యాన్ని పొందవచ్చని అన్నారు. “ఆరోగ్య శ్రీ” తరహాలోనే ఈ “ఆయుష్మాన్ భారత్” కార్డును వినియోగించుకోవచ్చని కేంద్రమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలోనే… ఏపీలో ఆరోగ్య శ్రీ అమలు చేయడానికి అవసరమైన డబ్బులు లేవని.. ఈ పథకం కింద ఆసుపత్రులకు బిల్లులు రావడం లేదని.. రోగులకు ట్రీట్ మెంట్ జరగడం లేదని స్పష్టం చేశారు.

ఇలా “ఆరోగ్య శ్రీ”కి మంగళం పాడేస్తున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని వ్యాఖ్యానించారంటూ వైసీపీ మండిపడుతోంది. నిధులు లేవనే సాకుతో రూ.25 లక్షల హెల్త్ కవరేజ్ ని అందించే ఆరోగ్య శ్రీ పథకానికి చంద్రబాబు – పవన్ లు మంగళం పాడినట్లేనని ఆరోపిస్తూ, తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోపక్క ఆరోగ్య శ్రీకి మంగళం అనే విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే చర్చా మొదలైంది!